హైదరాబాద్ లోని పాతబస్తీలో దారుణం జరిగింది. బహదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ దగ్గర సులేమాన్ బిన్ మాజీ అనే వ్యక్తి తన భార్య నిషాత్ ఫాతిమాను కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. ఆదివారం ( జూన్ 7 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... కిషన్ బాగ్ కు చెందిన సులేమాన్, ఫాతిమాలకు పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు.
సులేమాన్, ఫాతిమాలకు తరచూ గొడవలు అయ్యేవని తెలుస్తోంది.ఇవాళ ఉదయం ఫాతిమాను కత్తితో పొడిచి చంపి.. ఇద్దరు పిల్లలను వేరొక గదిలో బంధించి పారిపోయాడు. హత్య జరిగిన 10 గంటల తర్వాత బహదూర్‌పురా పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుడు సులేమాన్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.
