- సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
సంగారెడ్డి , వెలుగు: ఎంఎన్ఆర్ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యానికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సమయానికి చికిత్స చేయకపోవడంతోనే చనిపోయాడని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితులకు కథనం మేరకు.. మెదక్జిల్లా నర్సాపూర్ టౌన్ కు చెందిన కాసెట్టి సంతోష్ కుమార్ (44), రెండు దశాబ్దాలుగా ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. గత గురువారం సాయంత్రం విధులు ముగించుకొని ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తుండగా ఇస్మాయిల్ ఖాన్ పేట దాటాక సంతోష్ బైక్ ను దౌల్తాబాద్ వైపు నుంచి వచ్చే మరో బైక్ ఢీకొట్టింది.
సంతోష్ కుమార్ నుదుటిపైన గాయాలవడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొంది, అనంతరం ఎంఎన్ ఆర్ ఆస్పత్రిలో అడ్మిట్ అవగా.. చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం చనిపోయాడు. డాక్టర్లు సమయానికి చికిత్స చేయకపోవడంతోనే సంతోష్ మరణించాడని బాధిత బంధువులు, మిత్రులు ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. మృతుడి భార్య సంగీత కూడా అదే ఆస్పత్రిలో పదేండ్లుగా జాబ్ చేసిందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
న్యాయం చేసేదాకా డెడ్ బాడీని తీసుకెళ్లమని బైఠాయించారు. యాజమాన్యం స్పందించి ఆదివారం మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఉదయం భారీగా పోలీసులను మోహరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే సంతోష్ మృతి చెందాడని, రాజకీయ పార్టీల ప్రతినిధులు , అధికారు లు కలుగజేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
