దేవరకొండలో దారుణ సంఘటన.. ఎస్ఐ దాడిలో వ్యక్తి మృతి!

దేవరకొండలో దారుణ సంఘటన.. ఎస్ఐ దాడిలో వ్యక్తి మృతి!

దేవరకొండలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామపంచాయతీ పాలెం తాండలో నేనావత్ సూర్య నాయక్(60), నేనావత్ భీమా నాయక్ అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూవివాదం చోటుచేసుకుంది. ఈ వివాదంలో సూర్య నాయక్ మృతి చెందాడు. 

మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. భూవివాదం విషయంలో సూర్య నాయక్ పై చింతపల్లి పోలీస్ స్టేషన్ లో నేనావత్ భీమా నాయక్ ఫిర్యాదు చేశాడు.  ఫిర్యాదు మేరకు ఎస్ఐ సతీష్ రెడ్డి సూర్య నాయక్ ను స్టేషన్ పిలిపించి విచక్షణారహితంగా చితకబాదడంతో సృహా తప్పి కిందపడిపోయాడు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. అతన్ని వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

అయితే, అప్పటికే సూర్య నాయక్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఎస్ఐ కొట్టడంతోనే సూర్య నాయక్  చనిపోయాడని ఆరోపిస్తూ దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళకు దిగారు.   వెంటనే ఎస్సైను సస్పెండ్ చేయాలని బంధువులు  దేవరకొండ ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు.  

అనంతరం మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేయడంతో ఆసుపత్రి గేటుకు తాళం వేసి వారిని బయటకు వెళ్లకుండా నిర్భందించారని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన  జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు.. భూ వివాదంలో నేనావత్ సూర్య మృతికి కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణలతో చర్యలు చేపట్టారు. చింతపల్లి ఎస్ఐ సతీష్ రెడ్డిని హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించినట్లు తెలుస్తోంది.