
కొందరు సోషల్ మీడియా ద్వారా వాళ్లకున్న సమస్యల్ని, నచ్చని విషయాలను ఎండగడుతూ ఉంటారు. అలాంటిదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బెంగళూరు లవ్ స్టోరీ’ కూడా. అక్కడి ట్రాఫిక్ సమస్యను అందరికీ గుర్తుచేస్తూ, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా చేసిన ప్రయత్నమే ఈ లవ్ స్టోరీ. తన స్టోరీని, ఎదురైన ఎక్స్‌పీరియెన్స్‌ని ‘మాస్క్‌డ్ మేనియాక్92’ అనే యూజర్ నేమ్‌తో రెడిట్‌లో పోస్ట్ చేశాడు ఓ వ్యక్తి. అందులో ఏముందంటే...
బెంగళూరు, కోరమంగళలోని ఎజీపురా ఫ్లై ఓవర్‌ను 2017లో కట్టడం మొదలుపెట్టారు. 2.5 కిలోమీటర్ల ఈ ఫ్లై ఓవర్ పనులు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. అక్కడ కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. అయితే, ఆ ట్రాఫిక్‌లో నలిగి, విసుగెత్తిపోయిన ఒకతను తన అసహనాన్ని ఇలా చెప్పుకొచ్చాడు. ‘నేను మూడు సంవత్సరాల క్రితం నా భార్యని ‘సోనీ వరల్డ్ సిగ్నల్’ దగ్గర ట్రాఫిక్‌లో చూశా. ఆ ట్రాఫిక్‌లోనే మా మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరి ఆఫీస్ టైమింగ్ ఒకటే కావడంతో మా పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరం ప్రతి రోజూ సిగ్నల్ దగ్గర కలిసేవాళ్లం. అయితే, ఒక రోజు రెండుగంటలు ట్రాఫిక్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఇద్దరికీ ఆకలి వేయడంతో రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్‌కి వెళ్లాం. అక్కడే ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు కలిశాయి. ఒకరంటే ఒకరికి ఇష్టం అని చెప్పేసుకున్నాం. మా ఇద్దరి విషయం ఇంట్లో చెప్పాం. వాళ్లూ ఒప్పుకున్నారు. మా ఇద్దరి పెండ్లి అయింది. నాకు జాబ్‌లో ప్రమోషన్ కూడా వచ్చింది.
అయితే, ఇదంతా జరిగి మూడేండ్లు అయింది. అయినా, ఆ ఫ్లై ఓవర్ పనులు పూర్తి కాలేదు. ట్రాఫిక్ సమస్య తీరలేదు’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చదివినవాళ్లంతా ‘ఏదైతే ఏంటి. దీనివల్ల నీకు మంచే జరిగింది’, ‘మంచి కథ. డైరెక్టర్లకి చెప్పండి. సినిమా తీస్తార’ని కామెంట్లు పెడుతున్నారు.