సొంతిల్లు లేక ఖాళీ జాగాలో కర్మకాండ

సొంతిల్లు లేక ఖాళీ జాగాలో కర్మకాండ

కమలాపూర్, వెలుగు: సొంత ఇల్లు లేకపోవడంతో మృతదేహాన్ని బంధువులు స్థానిక శ్మశానవాటిక దగ్గర ఖాళీ స్థలంలో టెంటు వేసి ఉంచారు. అక్కడే కర్మకాండ నిర్వహించి అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఈ సంఘటన హన్మకొండ జిల్లా కమలాపూర్  మండల కేంద్రంలో జరిగింది. కమలాపూర్  మండల కేంద్రానికి చెందిన గాజుల రాజేందర్ (50) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు.

నిరుపేద కుటుంబానికి చెందిన రాజేందర్  30 ఏండ్ల క్రితం స్వగ్రామం సోముదేవరపల్లి నుంచి కమలాపూర్ కు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. స్థానిక కూరగాయల మార్కెట్  వద్ద టీ కొట్టు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకూ పెండ్లయింది. పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల పరిస్థితి చూసి పద్మశాలి కుల సంఘం సభ్యులు.. రాజేందర్  అంత్యక్రియల కోసం రూ.11 వేల ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకొని గృహ వసతి కల్పించాలని పలువురు కోరారు.