
సూర్యాపేటలో కబడ్డీ ఆటలపోటీల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్టేజీ కూలి అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే. వారందరినీ హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రులలో చేర్పించారు. అయితే నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులలో సైదులు అనే వ్యక్తి చనిపోయాడు. దాంతో నిమ్స్‌లో ఉన్న బాధితులను మరియు చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.
‘సూర్యాపేట ఘటనలో అనేక మంది పేదలు గాయపడ్డారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అందరూ చూశారు. దాదాపు 200 మంది గాయపడ్డారు. నిమ్స్‌లో 20 మంది చికిత్స పొందుతున్నారు. మిగతా వారు కామినేని, యశోద, సూర్యపేట ఆస్పత్రులలో చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరిని పట్టించుకోకపోవడం వల్ల బాధితులందరూ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగి నాలుగు రోజులు అయినా ప్రభుత్వ పెద్దలు స్పందించకడం సిగ్గుచేటు. కనీసం దీని మీద విచారణ కూడా చేపట్టలేదు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు, వామన రావ్ దంపతుల హత్య, రైతుల ఆత్మహత్యలపై విచారణ ఎంత వరకు వచ్చింది? ఈ ఘటన జరిగిన ప్లేస్‌లో 15 వేల మందికి సరిపడా స్టేడియం ఏర్పాటు చేశామన్నారు. కనీసం 2 వేల మంది కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు చేయలేదు. ఈ కబడ్డీ పోటీలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందా? మంత్రి కుటుంబం నిర్వహించిందా? లేక రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ నిర్వహించిందా? గాయపడ్డ వారి దగ్గరికి కనీసం ఒక్క మంత్రి రాలేదు. ఘటన జరిగిన తరువాత బాధితులను పలకరించే దిక్కు లేదు. ఈ ఘటనలో సైదులు అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కబడ్డీ పోటీలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం రూ. 10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలి’ అని ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు.