యాదాద్రి జిల్లాలో మ్యాట్రీమోనీల్లో ప్రకటనలిచ్చి.. ఐదుగురితో పెండ్లి!.

యాదాద్రి జిల్లాలో మ్యాట్రీమోనీల్లో ప్రకటనలిచ్చి.. ఐదుగురితో పెండ్లి!.
  • నిత్య పెండ్లి కొడుకును అరెస్ట్ చేసిన భువనగిరి పోలీసులు

యాదాద్రి, వెలుగు : మ్యాట్రీమోనీలో ప్రకటనలు ఇచ్చి పెండ్లీలు చేసుకుని యువతులను మోసగించిన నిత్య పెండ్లి కొడుకును యాదాద్రి జిల్లా భువనగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని కడపకు చెందిన సోమవరపు సురేందర్​చెన్నైలో ఎంబీఏ చదివాడు. ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. మైనింగ్​బిజినెస్​చేస్తున్నట్టు, పెండ్లి చేసుకునేందుకు వధువు కావాలని పలు క్రిస్టియన్ మ్యాట్రిమోనీల్లో ప్రకటనలు ఇచ్చాడు. 

2021లో యాదాద్రి జిల్లాకు భువనగిరికి చెందిన మాధురితో అతడికి కడపలోని చర్చిలో పెండ్లి జరిగింది. కాగా.. సురేందర్​పేరెంట్స్ మ్యారేజీకి రాలేదు. అనంతరం వీరికి కొడుకు పుట్టాడు. అతడు నిత్యం బిజినెస్​పేరుతో టూర్లకు వెళ్లేవాడు. కాగా.. అంతకు ముందే విజయవాడకు చెందిన కృష్ణవేణితో అతడికి పెండ్లి అయిందని, రూ. 12 లక్షలు కాజేశాడని, రూ. 7 లక్షలు ఇచ్చి సెటిల్​మెంట్ చేసుకున్నాడని మాధురికి తెలిసింది. 

అనంతరం మాధురి ఇంటికి కృష్ణవేణి వచ్చి తనను పెండ్లి చేసుకుని మోసగించాడని చెప్పింది. మరో ముగ్గురు యువతులను కూడా పెండ్లి చేసుకుని సురేందర్​మోసగించాడని పెండ్లికి మధ్యవర్తి అయిన కిరణ్ కుమార్ ద్వారా తెలిసింది. దీంతో భర్తను మాధురి నిలదీయడంతో డబ్బు కోసం వేధించసాగాడు. ఆమె నుంచి రూ. 15 లక్షలు, 30 తులాల గోల్డ్ తీసుకున్నాడు. దీంతో వేధింపులు భరించలేని మాధురి గతేడాది ఆగస్టులో భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు సురేందర్​ను పోలీసులు కడపలో అరెస్ట్​ చేసి తీసుకొచ్చి మంగళవారం కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్​తరలించారు.