20 రూపాయల భేల్ పూరి కొంటే బ్యాంక్ స్టేట్ మెంట్ ఫ్రీ.. రోడ్డు పక్కనే అమ్మే బేల్ పూరి కొనుగోలుచేసిన ఓ వ్యక్తి ..భేల్ పూరి ప్యాక్ చేసిన పేపర్లను చూసి షాక్ అయ్యాడు. బేల్ పూరి ప్యాక్ చేసిన రెండు పేపర్లలో యూనియన్ బ్యాంకుకు చెందిన ఓ ఖాతాదారుడు లావాదేవీల ఫుల్ స్టేట్ మెంట్ ఉంది. ఆ పేపర్లలో కస్టమర్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఖాతాదారుడి పేరు, అకౌంట్ నంబర్ సహా కీలక సమాచారం ఉంది. తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. డేటా ప్రైవసీపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.
సుదాన్షు అంభోరే అనే సోషల్ మీడియా యూజర్ X లో ఓ పోస్ట్ షేర్ చేస్తూ..డేటా ప్రైవసీపై ఆందోళన వ్యక్తం చేశాడు. బ్యాంకు ఖాతా డేటా ప్రైవసీ అనేది ఆర్థిక భద్రతకు అత్యంత కీలకం. బ్యాంకులు వ్యక్తిగత సమాచారం ఖాతా వివరాలు, ఆధార్, పాన్ వంటివి గోప్యంగా ఉంచుతాయి. ఇవి మిస్ యూజ్ అయితే సైబర్ నేరాలకు అవకాశం ఉందంటూ ఆందోళన చెందాడు.
“రోడ్డు పక్కన ఓ వ్యాపారి దగ్గర రూ20కి ఒక భేల్ పూరి కొన్నాను..అది ఎవరో ఒకరి రెండు పేజీల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో చుట్టి ఉంది. ఆ డాక్యుమెంట్ లో ఖాతాదారుని పేరు, ఖాతా నంబర్, లావాదేవీల హిస్టరీ సహా సున్నితమైన కస్టమర్ డేటా ఉంది. మనదేశంలో డేటా ప్రైవసీ అనేది నిజంగా ఒక పెద్ద జోక్ అయిపోయిందని పోస్టు రాశాడు.
సుదాన్ష్ పోస్ట్ షేర్ చేసిన వెంటనే నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఆ స్టేట్ మెంట్లు వీధి వ్యాపారులకు ఎలా వచ్చాయి అనేదానిపై పెద్ద చర్చ సాగింది. చాలామంది నెటిజన్లు ప్రైవసీ బ్యాంకింగ్ డాక్యుమెంట్లు రోడ్డు పక్కనే అమ్మే వ్యాపారుల చేతిలో ప్యాకేజింగ్ పేపర్లుగా మారడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు రోడ్డు పక్కన దొరికే ఆహారం పరిశుభ్రతపై కూడా ఆందోళనలను వ్యక్తం రేకెత్తించింది.
►ALSO READ | పెట్రోల్ జీఎస్టీ కిందకు తీసుకొస్తే లీటర్‌కు రూ.34 తగ్గుతుందా..? ఇవిగో అసలైన లెక్కలు..
ఓ నెటిజన్ ఆ పోస్టుకు రిప్లై ఇస్తూ ఇలా రాశాడు.. “నేను గూగుల్‌లో వెతుకుతుండగా ఒక జోన్ మొత్తానికి సంబంధించిన గత కొన్ని సంవత్సరాల యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల జీతాల వివరాలు నాకు దొరికాయి‘‘అని షేర్ చేశాడు.
మెడికల్ రిపోర్టుల విషయంలో కూడా ఇలా జరగడం నేను విన్నాను అంటూ మరోనెటిజన్ షేర్ చేశాడు. బహుశా బేల్ పూరి భయ్యాలను రా ఏజెంట్లుగా నియమించుకోవాలేమో అంటూ సెటైరికల్ గా స్పందించారు.
మరొక యూజర్ ప్రైవసీ, పరిశుభ్రత రెండు అంశాలను వివరంగా ప్రస్తావిస్తూ ఇలా అన్నారు..ప్రైవసీ అనేది ఇప్పుడు హాస్యాస్పదమైన విషయం..అలాగే పరిశుభ్రత కూడా. మీ చిరుతిండి కోసం డబ్బాగా మారకముందు ఆ కాగితాలన్నీ ఎక్కడెక్కడ ఉండేవో ఒక్కసారి ఆలోచించండి..బహుశా వాటిని పాతపేపర్లు అమ్మేవాడు కొని ఉంటాడు..వాటిపై ఎలుకలు పాకి, వాటిపై మూత్రం కూడా పోసి ఉన్న దుమ్ముపట్టిన ఓ మూలన పెట్టి ఉండవచ్చు. వెంటనే అలాంటివి పారేయ్యాలి అంటూ సలహా ఇచ్చాడు.
సుదాన్ష్ పెట్టిన పోస్టుతో మన దేశంలో డేటా ప్రైవసీ, దాంతోపాటు వీధుల్లో దొరికే ఫుడ్ పరిశుభ్రతపై ఆందోళన స్పస్టమవుతోంది. డేటా ప్రైవసీపై ఇంకా కఠినమైన సెక్యూరిటీ సిస్టమ్ అవసరం అని చెబుతున్నారు.
