పెట్రోల్ జీఎస్టీ కిందకు తీసుకొస్తే లీటర్‌కు రూ.34 తగ్గుతుందా..? ఇవిగో అసలైన లెక్కలు..

పెట్రోల్ జీఎస్టీ కిందకు తీసుకొస్తే లీటర్‌కు రూ.34 తగ్గుతుందా..? ఇవిగో అసలైన లెక్కలు..

దేశంలో ఇంధన ధరల మంట సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. గడిచిన 8 రోజుల్లోనే 3 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద మార్కును దాటేసింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.99.51కి చేరింది. దీంతో పెట్రోల్, డీజిల్‌ను వెంటనే GST పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ మరోసారి బలంగా వినిపిస్తోంది. దీనివల్ల భారీ ధరల నుండి ప్రజలకు విముక్తి లభిస్తుందని కోరుతూ చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ బ్రిజేష్ గోయల్ స్వయంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు.

పన్నుల బాదుడును గమనిస్తే.. మనం కొనే ఇంధనం ధరలో సగానికి పైగా పన్నులే ఉంటున్నాయి. ఒకే దేశం-ఒకే పన్ను నినాదంతో 2017లో మోడీ సర్కార్ జీఎస్టీ పన్ను విధానాన్ని అమలులోకి తెచ్చినప్పటికీ.. పెట్రోల్, డీజిల్‌ను దీని నుండి మినహాయించారు. ఫలితంగా రాష్ట్రాలు తమ ఇష్టానుసారంగా వ్యాట్ విధిస్తూ ప్రజలపై భారం మోపుతున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన ధరలు అమలవుతూ వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.

పన్నుల అసలు లెక్క ఇదే (ఢిల్లీలోని రేట్ల ప్రకారం):
లీటర్ పెట్రోల్ అసలు ధర కేవలం రూ.66.29 మాత్రమే. కానీ మన చేతికి వచ్చేసరికి అది రూ.100 కి ఎలా చేరుతుందో ఈ లెక్క చూస్తే అర్థమవుతుంది. పెట్రోల్ అసలు ధర రూ.66.29 కాగా.. దీనిపై కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు రూ.11.90 గా ఉంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ లీటరుకు రూ.16.03 గా ఉంది. వీటన్నింటితో పాటు బంక్ నిర్వాహకులకు ఇచ్చే డీలర్ కమిషన్ లీటరుకు రూ. 4.42గా ఉంది. ఇవన్నీ కలిపి మొత్తం ధర రూ.99.51 కి చేరుతోంది దేశరాజధాని ఢిల్లీలో. రేట్లు ఎక్కువగా ఉన్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మరో రూ.15 వరకూ లీటరుకు పన్నులు కలిపి వసూలు చేస్తున్నాయి. అంటే ఏపీ తెలంగాణలోని ప్రజలు ప్రతి లీటర్ పెట్రోల్‌పై దాదాపు రూ.45 నుంచి రూ.50 వరకూ కేవలం పన్నులు, డీలర్ మార్జిన్ రూపంలోనే వెళ్తోంది. 

ఇక డీజిల్ విషయానికి వస్తే దాని అసలు ధర రూ.67.36 కాగా.. ఎక్సైజ్ డ్యూటీ రూ.7.80, వ్యాట్ రూ.13.39, డీలర్ మార్జిన్ రూ.3.03 గా ఉంది. అంటే డీజిల్‌పై కూడా రూ. 24 కేవలం పన్నులు, మార్జిన్ రూపంలోనే సామాన్యుడిపై భారంగా మారుతోంది ఢిల్లీలో. తెలుగు రాష్ట్రాల్లో అమ్మకపు రేట్ల ప్రకారం ఈ బాదులు ఇంకా ఎక్కువగానే కొనసాగుతోంది. 

ALSO READ : పెట్రోల్ డీజిల్ రేట్లను రూపాయి రూపాయి పెంచుతున్న మోడీ సర్కార్..

18% జీఎస్టీ విధిస్తే.. ఏపీ తెలంగాణలో పెట్రోల్ రేట్లివే:

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్‌లను రద్దు చేసి పెట్రోల్‌ను 18 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే రేట్లు భారీగా తగ్గుతాయి. ట్యాక్స్ లేని పెట్రోల్ ధర రూ. 66.29 పై 18% జీఎస్టీ లెక్కిస్తే పన్ను కేవలం రూ.11.93 మాత్రమే అవుతుంది. అప్పుడు డీలర్ మార్జిన్ రూ.4.42 కలిపినా కూడా లీటర్ పెట్రోల్ ధర రూ.78.22 లకే లభిస్తుంది. అంటే ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న పెట్రోల్ లీటరు రేటు రూ.112 కంటే రూ.34 తగ్గుతుంది. ఇక ఏపీలో లీటరు రూ.114 వరకూ ఉండగా జీఎస్టీ అమలైతే లీటరుపై రూ.36 వరకూ భారం తగ్గుతుంది. ఇది నిత్యావసరాల రేట్లు తగ్గి ప్రజలపై ద్రవ్యోల్బణ భారం తగ్గేందుకు తోడ్పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.