పెట్రోల్ డీజిల్ రేట్లను రూపాయి రూపాయి పెంచుతున్న మోడీ సర్కార్.. అసలు ప్లాన్ ఏంటి? నష్టాలు తగ్గాయా?

పెట్రోల్ డీజిల్ రేట్లను రూపాయి రూపాయి పెంచుతున్న మోడీ సర్కార్.. అసలు ప్లాన్ ఏంటి? నష్టాలు తగ్గాయా?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఒకేసారి కాకుండా.. కొన్ని రోజులకు ఒక రూపాయి చొప్పున పెంచుకుంటూ పోవాలనే కేంద్ర ప్రభుత్వ వ్యూహం వెనుక పెద్ద ఆర్థిక లెక్కలే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడంతో దేశీయ చమురు కంపెనీలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ నష్టాల నుంచి కంపెనీలను గట్టెక్కించడానికి.. అదే సమయంలో ప్రజల నుండి ఒకేసారి తీవ్ర వ్యతిరేకత రాకుండా చూసేందుకు మోడీ సర్కార్ ఈ స్లో పాయిజన్ పద్ధతిని ఎంచుకుంది.

ఇటీవల వరుసగా రెండు వారాల్లోనే మూడుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన తర్వాత ఆయిల్ కంపెనీల ఆర్థిక పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తోంది. ఈ పెంపుకు ముందు అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగినా దేశీయంగా ధరలు స్థిరంగా ఉంచడం వల్ల ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు సుమారు రూ.16వందల కోట్ల వరకు భారీ నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా లీటర్ డీజిల్‌పై రూ.20 నుండి రూ.25 వరకు, పెట్రోల్‌పై రూ.15 వరకు కంపెనీలకు నష్టం వచ్చేది.

ఇప్పుడు వరుసగా మూడుసార్లు ధరలను పెంచిన తర్వాత ఆయిల్ కంపెనీల రోజువారీ నష్టాలు మెల్లగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీల రోజువారీ నష్టం అటూ ఇటుగా రూ.వెయ్యి కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. అంటే ఈ మూడు విడతల పెంపు ద్వారా రోజువారీ నష్టాల్లో భారీగా ఉపశమనం లభించింది.

►ALSO READ | చిన్న సాకుతో క్లెయిమ్ ఎగ్గొట్టిన ఇన్సూరెన్స్ కంపెనీ.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కన్జూమర్ కోర్టు

పెంపుకు మునుపటి పరిస్థితులతో పోలిస్తే ఆయిల్ కంపెనీల నష్టాల భారం దాదాపు 25 నుంచి 30 శాతం వరకు తగ్గింది. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకుల దృష్ట్యా కంపెనీలు ఇంకా పూర్తి లాభాల్లోకి రాలేదు. ప్రతి రూపాయి పెంపు కూడా ఆయిల్ కంపెనీల బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరుస్తోందని, రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా రేట్లు తగ్గకపోతే మరికొన్ని విడతలుగా ఈ పెంపు ప్రక్రియ కొనసాగటం ఖాయం అంటున్నారు నిపుణులు.

పెరిగిన రేట్లు ఎన్నాళ్లుంటాయ్..?

అయితే అందరి అనుమానం పాత నష్టాల రికవరీ గురించే. మోడీ సర్కార్ ప్రస్తుతం ఆయిల్ కంపెనీల నష్టాలను తగ్గించేందుకు పెంచే రేట్లను కనీసం 3 నుంచి 4 ఏళ్ల పాటు అలాగే కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సో అమెరికా ఇరాన్ యుద్ధం ముగిశాక పరిస్థితులు చక్కబడి క్రూడ్ ఆయిల్ ప్రపంచ మార్కెట్లలో తగ్గినా ఆ రిలీఫ్ ప్రజలకు ఇవ్వకుండా ఆయిల్ కంపెనీలకే కేంద్ర ప్రభుత్వం వదిలేయెుచ్చని వారు చెబుతున్నారు. గతంలో కూడా మోడీ ప్రభుత్వం క్రూడ్ రేట్ల తగ్గుదల సమయంలో ఇలానే చేసింది. మళ్లీ అవసరమైతే పెట్రోల్, డీజిల్ మీద పన్ను వేసి కంపెనీలకు వెళ్లే లాభాలను కొంత తగ్గించి తన ఖజానాకు సర్కార్ రీరూట్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని గత అనుభవాలు పంచుకుంటున్నారు నిపుణులు. కావాలంటే వచ్చే ఎన్నికలకు కొన్ని నెలల ముందు దేశ ప్రజలకు ఊరట అంటూ కొంత తగ్గించే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు.