చిన్న సాకుతో క్లెయిమ్ ఎగ్గొట్టిన ఇన్సూరెన్స్ కంపెనీ.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కన్జూమర్ కోర్టు

చిన్న సాకుతో క్లెయిమ్ ఎగ్గొట్టిన ఇన్సూరెన్స్ కంపెనీ.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కన్జూమర్ కోర్టు

ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీ కొనటం ఎంత ఈజీనో అవసరమైనప్పుడు క్లెయిమ్ పొందటం కూడా అంతే కష్టం అన్నట్లుగా మారింది పరిస్థితి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అప్రూవ్ చేసేటప్పుడు కంపెనీలు టెక్నికల్ లోపాలు, కఠినమైన నిబంధనలను సాకుగా చూపి క్లెయిమ్స్ రిజెక్ట్ చేయడం తరచూ చూస్తుంటాం. కేవలం కొన్ని గంటల హాస్పిటలైజేషన్ సమయం తక్కువగా ఉందనే కారణంతో క్లెయిమ్ తిరస్కరించిన ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి త్రిసూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కోలుకోలేని గట్టి షాక్ ఇచ్చింది.

కరోనా సోకిన ఒక పాలసీదారుడు అక్టోబర్ 16 నుండి 19, 2020 వరకు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే పాలసీ రూల్స్ ప్రకారం కనీసం 72 గంటల పాటు నిరంతరాయంగా ఆసుపత్రిలో ఉండాలి. కానీ సదరు వ్యక్తి కేవలం 70 గంటలు మాత్రమే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడని.. అంటే 2.5 గంటల సమయం తక్కువగా ఉందంటూ ఇన్సూరెన్స్ కంపెనీ రూ. లక్ష క్లెయిమ్‌ను రిజెక్ట్ చేసింది.

దీనిపై విచారణ జరిపిన కన్స్యూమర్ కోర్ట్.. ఇన్సూరెన్స్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్య విజ్ఞానం, సాంకేతికత పెరగడం వల్ల ప్రస్తుతం ఆసుపత్రిలో ఉండే సమయం తగ్గిందని, తక్కువ సమయం ఉన్నంత మాత్రాన వ్యాధి తీవ్రత తక్కువగా ఉందని అర్థం కాదని స్పష్టం చేసింది. కేవలం 2.5 గంటల సమయం తక్కువగా ఉండటం అనేది పాలసీ ఉద్దేశాన్ని దెబ్బతీసే పెద్ద తప్పిదం కాదని కోర్టు తేల్చి చెప్పింది.

ALSO READ : జియో, ఎయిర్‌టెల్‌కి నిద్ర లేకుండా చేస్తున్న BSNL..

ఇన్సూరెన్స్ కంపెనీలు తమ రూల్స్ అర్థవంతంగా, వినియోగదారులకు మేలు చేసే విధంగా వర్తింపజేయాలి తప్ప.. క్లెయిమ్స్ నిరాకరించడానికి సాకులుగా వాడుకోకూడదని కమిషన్ పేర్కొంది. బాధితుడికి ఇవ్వాల్సిన రూ.లక్ష ఇన్సూరెన్స్ మొత్తంతో పాటు, మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.10వేలు పరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ.5వేలు చెల్లించాలని ఇన్సూరెన్స్ సంస్థను ఆదేశించింది. అంతేకాకుండా కేసు ఫైల్ చేసిన నాటి నుండి 9 శాతం వార్షిక వడ్డీతో ఈ మొత్తాన్ని చెల్లించాలని తీర్పునిచ్చింది. టెక్నికల్ సాకులతో క్లెయిమ్స్ రిజెక్ట్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ తీర్పు ఒక హెచ్చరిక లాంటిదే.