రైల్లోంచి కిందపడ్డ వ్యక్తికి ట్రీట్​మెంట్ ఇవ్వకుండా బెడ్​కు కట్టేసిన్రు

రైల్లోంచి కిందపడ్డ వ్యక్తికి ట్రీట్​మెంట్ ఇవ్వకుండా బెడ్​కు కట్టేసిన్రు
  • రైల్లోంచి కిందపడ్డ వ్యక్తికి.. ట్రీట్​మెంట్ ఇవ్వకుండా బెడ్​కు కట్టేసిన్రు
  • రోజంతా అలాగే వదిలేయడంతో మృతి
  • పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం

పెద్దపల్లి, వెలుగు: రైలులో నుంచి కిందపడ్డ వ్యక్తి ట్రీట్​మెంటుకు సహకరించట్లేదని బెడ్​కు కట్టేసి వదిలేశారు. దాంతో బాధితుడు ప్రాణాలు విడిచాడు. సంపర్క్​ క్రాంతి ఎక్స్​ప్రెస్​లో హజ్రత్​నిజాముద్దీన్ నుంచి డోన్​కు వెళ్తున్న ఉత్తరాఖండ్​కు చెందిన అతుల్​దాలీ(42).. పెద్దపల్లి రైల్వే స్టేషన్,​ పొత్కపల్లి మధ్యలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడ్డాడు. అక్కడున్నోళ్లు పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో బాధితుడు వింతగా ప్రవర్తిస్తూ డాక్టర్లు, సిబ్బందిని దగ్గరకు రానివ్వకపోవడంతో అతడ్ని ఆస్పత్రిలోనే బెడ్​కు కట్టేశారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం దాకా అలాగే కట్టేయడంతో బాధితుడు గాయాల బాధ భరించలేక చనిపోయాడు. ఈ విషయం రైల్వే పోలీసులకు చెప్పడంతో మృతుడి ఆధార్​కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్ట్​మార్టానికి అతడి డెడ్​బాడీని మార్చురీలో పెట్టారు. రైలు నుంచి పడిపోయిన అతుల్ దాలీ చావుకు ఆస్పత్రి సూపరింటెండెంట్, డ్యూటీ డాక్టర్ ​కారణమని, వాళ్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక టీఆర్ఎస్​ లీడర్​ బెక్కం ప్రశాంత్​ వైద్యశాఖ రాష్ట్ర సీనియర్​ ప్రోగ్రాం ఆఫీసర్​ సూర్యశ్రీకి ఫిర్యాదు చేశారు.