పిటిషనర్ కు సుప్రీం కోర్టు షాక్.. 5 లక్షలు ఫైన్ కట్టాలని ఆదేశం

పిటిషనర్ కు సుప్రీం కోర్టు షాక్.. 5 లక్షలు ఫైన్ కట్టాలని ఆదేశం

న్యూఢిల్లీ: థమ్సప్, కోకాకోలా కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం.. వాటి అమ్మకాలను బ్యాన్ చేయాలి అంటూ పిటిషన్ వేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. పిటిషనర్ చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశాడంటూ రూ.5 లక్షల జరిమానా విధించింది. తాను సామాజిక కార్యకర్తనని పేర్కొన్న ఉమెద్​సిన్హా చావ్డా అనే వ్యక్తి థమ్సప్, కోకాకోలాల సేల్స్ బ్యాన్ చేయాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, హేమంత్ గుప్తా, అజయ్ రాస్తోగిలతో కూడిన బెంచ్.. పిటిషనర్ ఈ విషయంపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండా వ్యాజ్యం దాఖలు చేసినట్లు పేర్కొంది.

రెండు బ్రాండ్ లనే ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారని, ఆ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం అని నిరూపించలేకపోయారంటూ పిటిషన్ ను కొట్టివేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిధిని మించి, చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారని ఆగ్రహించిన బెంచ్ రూ. 5 లక్షల జరిమానా కట్టాలని పిటిషనర్ ను ఆదేశించింది. నెల రోజుల్లోగా జరిమానా మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు అసోసియేషన్ కు పంపించాలని చావ్డాను ఆదేశించింది.