ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

 ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

‘మన బడి’ వర్క్స్​ స్పీడప్​ చేయాలి 

సిద్దిపేట, వెలుగు :  మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే దుబ్బాకలో పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్ లో దుబ్బాక నియోజకవర్గంలోని మన ఊరు మన బడి పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో  మైనర్ రిపేర్లు, ఎలక్ట్రిసిటీ, తలుపులు, కిటికీలు, ఇతర రిపేర్లు పూర్తి కాగానే కలరింగ్ చేయాలన్నారు.  రాష్ట ప్రభుత్వం కలరింగ్  కోసం  ప్రత్యేకంగా కాంట్రాక్ట్ సంస్థ కు పనులు అప్పగించిందన్నారు.  పనులు పూర్తి కాగానే  ఎంపీడీవో, ఎంఈఓలు పర్యవేక్షణ చేసి డీఈఓకు సమాచారం ఇవ్వాలని సూచించారు.  వంట గదులు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, ప్రహరీ, మంచినీటి వసతి, సంపు, తదితర మేజర్​ వర్క్స్​ పురోగతిపై  కలెక్టర్ సమీక్షించారు. ఎంపీడీవోలు, ఎంపీఓలు క్షేత్ర స్థాయిలో  పర్యటించి ఎన్ఆర్ఈజీఎస్  కింద చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని,  ఎక్కువ శాతం పనులు ఎస్ఎంసీ, సర్పంచ్ లు చేస్తున్నందున లక్ష్యాలను నిర్ధేశించుకుని పనులు పూర్తి  చేయాలని సూచించారు.  

డబుల్ బెడ్  రూమ్ ఇండ్ల పై సమీక్ష

దుబ్బాక నియోజకవర్గంలో ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమీక్షించారు.  దుబ్బాక నియోజకవర్గంలో  నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ రూమ్  ఇండ్ల ను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలవారీగా  పనులు  ఏ దశలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో మంజూరైన ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారుల లిస్ట్ లను తయారు చేయాలన్నారు. పూరైన ఇండ్లకు ఎలక్ట్రిసిటీ పనులు పూర్తి చేయాలని , మంచి నీటి వసతి ని కల్పించాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయగానే  బిల్లులు వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పారు. సమావేశంలో  పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్, డబుల్ బెడ్ రూమ్ నోడల్ ఆఫీసర్ శ్యాం ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. 


టీబీని పూర్తిగా నివారించడమే లక్ష్యం

మెదక్​ టౌన్​, వెలుగు : టీబీ వ్యాధిని పూర్తిగా నివారించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు రాష్ట్ర క్షయ నివారణ అధికారి డాక్టర్ రాజేశం తెలిపారు. మెదక్ జిల్లాలోని పీహెచ్​సీ డాక్టర్లు, నోడల్​ పర్సన్లతో మంగళవారం కలెక్టరేట్ లో డీఎంహెచ్​వో డాక్టర్​ విజయ నిర్మల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 వరకు దేశంలో క్షయ వ్యాధిని నిర్మూలించాలన్నది ప్రధాని మోడీ సంకల్పమన్నారు. పొగాకు వాడే వారికి , షుగర్ వ్యాధి, కాన్సర్, హెచ్ఐవీ రోగులకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి పరీక్షలు చేయించి అవసరమైన మందులు అందజేయాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గలంలోని రోగులను మంత్రి హరీశ్​రావు దతత్త తీసుకుని పోష్టికాహారం అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టెక్నికల్ ఆఫీసర్ వాసుప్రసాద్ , జిల్లా క్షయ నివారాణాధికారిణి డాక్టర్ మాధురి, డాక్టర్ నవీన్ , జిల్లా కో ఆర్డినేటర్  సునీల్, సూపర్​వైజర్లు సాయిబాబా, రాజేశ్వర్ రావు, చంద్ర శేఖర్, శ్రీనివాస్, మహేశ్​  తదితరులు 
పాల్గొన్నారు.


ఐఎంఎఫ్ఎల్ డిపో ఎదుట స్థానికుల నిరసన

మెదక్​ (కొల్చారం), వెలుగు: కొల్చారం మండలం చిన్నఘనపూర్ లో ఐఎంఎఫ్ఎల్ డిపో ఎదుట  మంగళవారం స్థానికులు నిరసన చేపట్టారు. వేలం పాట నిర్వహించి రూ.60 లక్షలకు హమాలీ పోస్టు అమ్మిన విషయంపై డిపో మేనేజర్ నాగేశ్వర్​ రావును ప్రశ్నించారు. స్థానిక యువతకు డిపోలో హమాలీ పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.  దీనిపై డీఎం స్పందిస్తూ వేలం పాట విషయం తనకు తెలియదని చెప్పారు.  ఒకవేళ వేలం పాట జరిగింది నిజమే అయితే, ఆ హమాలీ పోస్ట్​కు ఎంపికైన వ్యక్తిని డిపోలో పని చేయడానికి తీసుకోబోమని స్పష్టం చేశారు. హమాలీలను కొత్తగా తీసుకోవాలంటే  సప్లయర్స్ కమిటీ, హమాలీ యూనియన్, జిల్లా అధికారులు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్తగా హమాలీల నియామకాలు చేపట్టాలని కోరుతూ డీఎంకు వినతి పత్రం సమర్పించారు. దీనిని  పై ఆఫీసర్లకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. 

వేలం వేయలేదు. : హమాలీ యూనియన్

చిన్నఘనపూర్​ ఐఎంఎఫ్ఎల్ డిపోలో హమాలీ  పోస్ట్​ కోసం ఎలాంటి వేలం పాట నిర్వహించ లేదని హమాలీ యూనియన్ అధ్యక్షుడు సంజీవులు తెలిపారు.  మంగళవారం స్థానిక విలేకరుల సమావేశంలో యూనియన్​ అధ్యక్షుడు, నాయకులు మాట్లాడారు. హమాలీ పని కోసం రూ.60 లక్షలకు వేలం వేశారని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, యూనియన్ ఆధ్వర్యంలో వేలం పాట జరగలేదని ఆయన స్పష్టం చేశారు. 

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పోరాటం తప్పదు

జిన్నారం, వెలుగు :  కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పోరాటం తప్పదని కార్మిక సంఘాల అఖిలపక్షం నాయకులు అన్నారు. మంగళవారం బొల్లారం పారిశ్రామికవాడలో ఐడీఏ కాలనీ నుంచి మున్సిపల్ పాత ఆఫీస్ వరకు హెచ్ఎంఎస్, సీఐటీయూ, టీఆర్ఎస్ కేవీ ఆధ్వర్యంలో  బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తూ  కార్మిక హక్కులను కాలరాస్తుందన్నారు.  కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేసేంతవరకు పోరాటాలు కొనసాగుతాయన్నారు. నవంబర్ 1న బొల్లారంలో భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు  వి.వరప్రసాద్​రెడ్డి, నర్సింహారెడ్డి, రాజయ్య , గోవింద్ రెడ్డి,  మాజీ ఎంపీటీసీ రాజు, టీఆర్ఎస్  బీసీ సెల్ అధ్యక్షుడు చక్రపాణి, ఇతర సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి క్రీడల్లో సత్తా చాటాలి
ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

జగదేవపూర్ (కొమురవెల్లి), వెలుగు : గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయస్థాయిలో సత్తా చాటి తెలంగాణకు పేరు  తీసుకరావాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో  మంగళవారం తిగుల్ లో 33వ సబ్ జూనియర్ ఖో ఖో జాతీయస్థాయి శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. తెలంగాణ 
ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. అనంతరం క్రీడాకారుల వసతి కల్పనకు తమవంతుగా రూ.10వేలను అందించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు వెంకట్ రాంరెడ్డి, టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు శంకర్, టీపీటీఎప్​ మండల ప్రధాన కార్యదర్శి సత్తయ్య, ఉప సర్పంచ్ ఐలయ్య, పాఠశాల హెచ్ఎం అనసూయ,  కాంప్లెక్స్ హెచ్​ఎం రహీం, పీఈటీలు రవికుమార్ పాల్గొన్నారు.

పాపన్నపేట మండలంలో పంటకోత ప్రయోగం 

మెదక్​, వెలుగు:  ఎక్కువ పంట దిగుబడి రావడానికి రైతులు నాణ్యమైన విత్తనాలు వాడాలని జిల్లా చీఫ్​ ప్లానింగ్​ ఆఫీసర్​ చిన కొట్యాల్ అన్నారు. పంట మంగళవారం పాపన్నపేట మండల పరిధిలోని కొంపల్లి గ్రామంలో రైతు సత్తయ్య గౌడ్ పొలంలో పంట కోత  ప్రయోగం నిర్వహించారు.  పొలంలో 5x5 మీటర్ల పొడవు, వెడల్పులో పంట దిగుబడిని పరిశీలించగా 17.564 కిలోల ధాన్యం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా సీపీఓ మాట్లాడుతూ ప్రతి మండలంలోని వివిధ గ్రామాలలో వరి ఎక్కువగా వేసిన కొన్ని ప్రాంతాలను  ఎంపిక చేసి  పంట దిగుబడి ఎంత వస్తుందో అంచనా వేస్తామని ఆయన తెలిపారు. రైతులు సైంటిస్టులు, అగ్రికల్చర్​ ఆఫీసర్ల సూచనలు, సలహాల పాటిస్తూ నేల స్వభావానికి అనుగుణంగా నాణ్యమైన విత్తనాలు వాడితే ఎక్కువ పంట దిగుబడి వస్తుందన్నారు.  కారక్రమంలో డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ వెంకటేశ్, అసిస్టెంట్​ స్టాటిస్టికల్​ ఆఫీసర్​ కృష్ణ   పాల్గొన్నారు.

రామసముద్రం చెరువుకు గండి

నారాయణ్ ఖేడ్, వెలుగు : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని నమలిమెట్ గ్రామ శివారులోని రామసముద్రం చెరువుకు మంగళవారం ఉదయం గండి పడింది. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో చెరువులను పట్టించుకునేవారు లేకుండాపోయారని  రైతులు వాపోతున్నారు. చెరువు ప్రమాద స్థాయిలో ఉందని అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గండితో వరి కోతలకు సిద్ధంగా ఉన్న దాదాపు 400 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లిందని ఆందోళన చెందుతున్నారు. వెంటనే చెరువుకు రిపేర్లు చేపట్టాలని, తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 


జర్నలిస్టుల  సమస్యలపై పోరాడాలి


కోహెడ, వెలుగు : జర్నలిస్టులు ఐక్యమత్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ)జిల్లా ఉపాధ్యక్షుడు కోహెడ ప్రసాదరావు అన్నారు. మంగళవారం మండలంలోని  తంగళ్ళపల్లి వేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో  కోహెడ ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కమిటీ, హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ అనుబంధంగా ఈ క్లబ్ కొనసాగుతుందని తెలిపారు. అనంతరం కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 
సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కోహెడ ప్రసాదరావు, గౌరవ అధ్యక్షుడిగా పున్నం రాజు, అధ్యక్షుడిగా తలారి అశోక్, ఉపాధ్యక్షుడిగా ముల్కల హరీశ్, ప్రధాన కార్యదర్శిగా అర్షనపల్లి ముని, సహాయ కార్యదర్శిగా మంద రమేశ్, కోశాధికారిగా కొంకటి జితేందర్, కార్యవర్గ సభ్యులుగా ర్యాకం శ్రీనివాస్, వడ్డేపల్లి ప్రశాంత్ ఎన్నికయ్యారు. సమావేశంలో జర్నలిస్టులు సురుకొంటి శ్రీనివాస్ రెడ్డి, గొరిట్యాల లక్ష్మణ్  శ్రీనివాస్ ఉన్నారు.

సులభంగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలి

మెదక్ (కౌడిపల్లి), వెలుగు: విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలని డీఈవో రమేశ్ కుమార్​ టీచర్లకు సూచించారు. మంగళవారం ఆయన కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్​లో తొలిమెట్టు కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు.  టీచర్లు పాఠాలు ఎలా చెబుతున్నారో  గమనించారు. ఆయన వెంట సెక్టోరియల్ ఆఫీసర్ ​సుభాష్, హెచ్​ఎం సర్వేశ్వర్ ఉన్నారు.

చేగుంటలో హమాలీ కార్మికుల నిరసన​

మెదక్​ (చేగుంట), వెలుగు: హమాలీ రేట్లను పెంచాలని డిమాండ్​ చేస్తూ చేగుంట పట్టణంలో హమాలీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. మంగళవారం స్థానిక గాంధీ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హమాలీ సంఘం అధ్యక్షుడు సోమ వెంకటేశం మాట్లాడుతూ  మూడేండ్ల నుంచి హమాలీ చార్జీలు పెంచాలని వ్యాపారులను ఎన్నిసార్లు కోరినా వారు స్పందించకపోవడంతో ఆందోళనకు దిగామన్నారు. హమాలీల సమ్మెకు సీఐటీయూ జిల్లా నాయకురాలు బాలమణి సంఘీభావం తెలిపారు.  కార్యక్రమంలో సంఘం నాయకులు సండ్రుగు నర్సింలు, శ్రీనివాస్, వెంకటేశ్, లక్ష్మణ్, నల్ల పోచయ్య, వంజరి శ్రీనివాస్ పాల్గొన్నారు.