ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకే..‘మన ఇసుక వాహనం’ : టీజీఎండీసీ వైస్ చైర్మన్ భవేశ్ మిశ్రా

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకే..‘మన ఇసుక వాహనం’ : టీజీఎండీసీ వైస్ చైర్మన్ భవేశ్ మిశ్రా
  • యాప్​ ద్వారా ఆన్​లైన్​లో ఇసుక బుకింగ్​
  • పైలట్​ ప్రాజెక్టు జిల్లాల్లో కరీంనగర్​ ఒకటి
  • టీజీఎండీసీ వైస్ ​చైర్మన్​ భవేశ్​ మిశ్రా

కరీంనగర్ టౌన్, వెలుగు:  ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆన్​లైన్​ఇసుక బుకింగ్ విధానం ప్రవేశపెట్టనుందని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎండీసీ) వైస్ చైర్మన్ అండ్​ఎండీ భవేశ్ మిశ్రా తెలిపారు. శనివారం కరీంనగర్​కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి,  సీపీ గౌస్ ఆలంతో కలిసి మాట్లాడారు. మన ఇసుక వాహనం యాప్​ను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు రాష్ట్రంలోని  కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలను పైలట్​ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు చెప్పారు. 

ఈ నూతన విధానం ద్వారా వినియోగదారులకు ఇసుక సరఫరాను మరింత పారదర్శకంగా మార్చడమే కాకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఇసుక పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాన్యువల్ రసీదులు జారీ చేయొద్దన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఈ యాప్ లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చామని, 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను లబ్ధిదారులు పొందవచ్చని పేర్కొన్నారు.

 ప్రయోగాత్మక జిల్లాల అనంతరం ఇసుక నిల్వలు ఉన్న రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ప్రవేశపెడతామన్నారు. ఇసుక అవసరం ఉన్నవారు ఫోన్​లో మన ఇసుక వాహనం యాప్ డౌన్​లోడ్ చేసుకొని బుక్ చేసుకోవాలని, లేదా టీజీఎండీసీ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని సూచించారు. స్మార్ట్ ఫోన్లు లేనివారు గ్రామ పంచాయతీ కార్యదర్శులను సంప్రదించి బుక్ చేసుకోవాలని చెప్పారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. పైలట్​ప్రాజెక్టుగా మన జిల్లా ఎంపికైనందున అధికారులు నిబద్ధతతో పనిచేసి విజయవంతం చేయాలని ఆదేశించారు.

 కొత్త పాలసీకి అనుగుణంగా 15 రోజుల్లోగా ఏర్పాట్లు చేసుకోవాలని, సందేహాలు ఉంటే టీజీఎండీసీ ఆఫీసర్లతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ చాంబర్ లో టీఎన్జీవోల  డైరీని ఆవిష్కరించారు.

ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలి

అరైవ్​ అలైవ్ ​కార్యక్రమంలో భాగంగా సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో నగరంలో  నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టర్  పమేలా సత్పతి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బైక్​నడిపేవారు హెల్మెట్​ధరించాలని, కారులో వెళ్లేవారు సీట్​బెల్ట్​పెట్టుకోవాలని సూచించారు. ర్యాలీలో పాల్గొన్న వారికి పోలీస్ శాఖ తరఫున హెల్మెట్లు పంపిణీ చేశారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. హెల్మెట్  ధరిస్తే  90 శాతం ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. 

అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయరాజ్, టీఎన్జీవో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ దారం శ్రీనివాస్  రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ సోహం, అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరిస్వామి తదితరులు పాల్గొన్నారు.