చాలా మండలాల్లో పూర్తికాని ‘మన ఊరు మన బడి’ పనులు

చాలా మండలాల్లో పూర్తికాని ‘మన ఊరు మన బడి’ పనులు
  • 1,200 బడుల్లో 648 స్కూళ్లే ఓపెనింగ్​కు సిద్ధం
  • ఇయ్యాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభోత్సవాలు 

హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్​స్కూళ్లకు దీటుగా సర్కారు బడుల్లో వసతులు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మన ఊరు  మన బడి’ కార్యక్రమం ఆర్బాటమెక్కువ.. పనులు తక్కువ అన్న చందంగా మారింది. మూడేండ్ల కింద మొదలైన ఈ కార్యక్రమం.. నత్తనడకన సాగుతోంది. ఫస్ట్ ఫేజ్​లో ఎంపిక చేసిన స్కూళ్లలో.. కొన్నింటిలో పనులే ప్రారంభం కాలేదు. అసలు ఏ జిల్లాలో ఎన్ని స్కూళ్లను ఎంపిక చేశారు.. వాటిలో ఎన్ని నిధులతో డెవలప్​మెంట్​ పనులు చేస్తున్నారు.. ఇప్పటికీ ఎన్ని ఫండ్స్ ఖర్చు చేశారనే వివరాలన్నీ సీక్రెట్​గా ఉంచడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పనులు పూర్తయిన బడులను బుధవారం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. 

వాయిదాల మీద వాయిదా

మన ఊరు మన బడి స్కీమ్​కు నిధుల కొరత ఏర్పడడంతో చాలా బడుల్లో పనులన్నీ ఆగిపోయాయి. దీంతో మండలానికి 2 చొప్పున ఎంపిక చేసిన వాటిలో పనులు పూర్తిచేయాలని సర్కారు నిర్ణయించింది. దీంట్లో భాగంగా 612 మండలాల్లో 1,200 స్కూళ్లను సెలెక్ట్ చేసింది. అయితే, డిసెంబర్​ నెలాఖరులోపే వాటిలో పనులు పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పలు మార్లు కలెక్టర్లు, డీఈవోలను ఆదేశించారు. పనులు పూర్తికాకపోవడంతో కనీసం జనవరి సెకండ్ వీక్​ వరకైనా చేయాలని కోరారు. అప్పటికీ కాకపోవడంతో జనవరి 30న ప్రారంభించాలని భావించారు. ఆరోజు నాటికి పనులు పూర్తి చేయాలని డీఈవోలకు అధికారులు సూచించారు. అయితే చాలా బడులకు డ్యూయల్ డెస్క్​లు, ఫర్నీచర్ చేరలేదు. కొన్ని బడుల గోడలకు కలర్స్ పూర్తికాలేదు. దీంతో ఆ తేదీని కూడా ఫిబ్రవరి1కి మార్చారు.  

కొనసాగుతున్న పనులు

రాష్ట్రంలో మండలానికి రెండు చొప్పున 1,200 స్కూళ్లను రెడీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా సాధ్యం కాలేదు. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా 684 స్కూళ్లు మాత్రమే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.  చాలామండలాల్లో  ఎంపికచేసిన స్కూళ్లలో పనులు పూర్తికాలేదు. హైదరాబాద్​లో 16 మండలాలుంటే.. ప్రారంభోత్సవానికి కేవలం 6 మాత్రమే రెడీగా ఉన్నాయి. నిజామాబాద్​లో 33 మండలాలుంటే..13 స్కూళ్లు, కామారెడ్డిలో 23 మండలాలుంటే 11 బడులు మాత్రమే రెడీ గా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు దీనిపై నిలదీస్తాయనే భయంతో కొన్ని స్కూళ్లనైనా ప్రారంభించాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

గంభీరావుపేటలో ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్​, సబిత

మొదటి విడత మనఊరు మనబడి కార్యక్రమంలో ఎంపిక చేసిన సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట మండల కేంద్రంలో గల కేజీ టూ పీజీ క్యాపస్​ను బుధవారం మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి ఉదయం 11గంటలకు ప్రారంభించనున్నారు. అలాగే, ఎవరి నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రారంభించనున్నారు. సాయంత్రం 4గంటలకు రంగారెడ్డి జిల్లాలోని రాచులూర్​ ప్రైమరీ స్కూల్​ను మినిస్టర్ సబితారెడ్డి ఓపెన్ చేయనున్నారు.

అరకొరగా నిధులు విడుదల

రాష్ట్రంలో 26,065 సర్కారు స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 20 లక్షల మంది స్టూడెంట్స్​చదువుతున్నారు. ఈ స్కూళ్లలో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 2021లో ‘మన ఊరు  మన బడి’ స్కీమ్ ను తీసుకొచ్చింది. మూడు విడతల్లో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో అమలు చేస్తామని ప్రకటించింది. 2022 మార్చిలో వనపర్తి జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్​లో సీఎం కేసీఆర్ అధికారికంగా పనులు ప్రారంభించారు. 26 వేల బడుల్లో రూ.7,289 కోట్లతో వసతులు కల్పిస్తామని 2022–23 బడ్జెట్​లో పేర్కొన్నారు. తొలివిడతలో 9,123 బడులను ఎంపిక చేయగా, వాటిలో రూ.3,497 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. అయితే పనులకు ప్రభుత్వం సరిగా నిధులు కేటాయించకపోవడంతో పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. మరోపక్క రూ.30 లక్షలకు పైగా నిధులు ఖర్చు చేసే పనులకు టెండర్లు కూడా పిలువలేదు. దీంతో కొన్ని స్కూళ్లలో పనులే మొదలుకాలేదు.