ట్రక్ ‌‌షీట్ ‌‌లో తప్పుడు లెక్కలు

ట్రక్ ‌‌షీట్ ‌‌లో తప్పుడు లెక్కలు

జనగామ, వెలుగు : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గబ్బెటలో వడ్లు కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు చేతివాటం ప్రదర్శించారు. తప్పుడు లెక్కలు రాసి క్వింటాళ్ల కొద్దీ వడ్లు పక్కదారి పట్టించి అమ్ముకున్నాడు. తీరా రైతులకు విషయం తెలిసి ఆందోళనకు దిగడంతో రాజీకి వచ్చి డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. గబ్బెటలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలో 66 మంది రైతుల వద్ద సుమారు 5,980 బస్తాల వడ్లు కొన్నారు. అయితే తూకాలు ముగిసినప్పటికీ కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు రైతులకు ట్రక్ ‌‌ షీట్లు ఇవ్వకుండా తన వద్దే పెట్టుకున్నాడు. ఇటీవల రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. 

అయితే తూకం వేసిన వడ్లకు, తమ అకౌంట్లో పడిన డబ్బులు పొంతన కుదరకపోవడంతో అనుమానం వచ్చిన రైతులు సెంటర్ ‌‌ నిర్వాహకుడిని ప్రశ్నించారు. తనకేమీ తెలియదని రైస్ ‌‌ మిల్ ‌‌ ఓనరే కట్ ‌‌ చేశాడని చెప్పడంతో రెండు రోజుల క్రితం మిల్ ‌‌ ఓనర్ ‌‌ను నిలదీశారు.  తాను బస్తాకు కిలో మాత్రమే కట్ ‌‌ చేశానని, మిగతా వడ్ల సంగతి తనకు తెలియదని చెప్పడం, నిర్వాహకుడు కూడా సరిగా స్పందించకపోవడంతో పంచాయతీ పోలీస్ ‌‌ స్టేషన్ ‌‌కు చేరింది. 

230 బస్తాలు పక్కదారి

రైతుల ఒత్తిడికి తోడు పోలీసుల వార్నింగ్ ‌‌లతో దిగొచ్చిన నిర్వాహకుడు తానే వడ్లను అమ్మి, డబ్బులు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. రైతుల వడ్లు తూకం వేసిన తర్వాత ట్రక్ ‌‌షీట్లలో బస్తాల సంఖ్య తగ్గించి రాశానని, ఇలా 230 బస్తాలకు పైగా వడ్లను తన పేరుతో పాటు, తన బంధువు పేరున మిల్ ‌‌కు పంపినట్లు అంగీకరించి, డబ్బులు తిరిగి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. శుక్రవారం పలువురు రైతులకు రావాల్సిన సుమారు రూ. 2 లక్షలు చెల్లించగా, మిగతా వారికి త్వరలో ఇస్తానని ఒప్పుకున్నాడని తెలిసింది. 

11 బస్తాల వడ్లు  తక్కువ వచ్చినయ్ ‌‌

నాకు  వడ్ల పైసలు తక్కువ వచ్చాయి. నిర్వాహకుడిని అగితే మిల్లరే కోత పెట్టాడని చెప్పాడు. అతడిని అడిగితే తనకు తెలియదని ట్రక్ ‌‌షీట్ ‌‌ తీసి చూపించిండు. అందులో 11 బస్తాలు తక్కువ రాసినట్లు తెలిసింది. దీంతో మిగతా రైతులను కలుపుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినం.

– వెలిశాల పెద్ద అంజయ్య, బాధిత రైతు.