బెల్లంపల్లి రూరల్, వెలుగు: సమగ్ర సర్వేతోనే భూ సమస్యల పరిష్కారానికి అవకాశం దొరుకుతుందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం తాండూర్ మండలంలోని ద్వారకాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో రాంపూర్ శివారు భూముల సమగ్ర సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. నిజాం పాలన సమయంలో భూములన్నీ వారి ఆధీనంలోనే ఉండేవని, ఆ భూములు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాక సీలింగ్, ఇనాం, లావునిపట్టా, 38-ఈ, పట్టా భూములవంటి అనేక రకాలుగా విభజించి సర్వే, ఖాతా నంబర్లు ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఆ సమయంలో జరిగిన భూ మార్పుల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తి ఇప్పటికి భూ సమస్యలు అలాగే కొనసాగుతూ న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్నాయన్నారు.
క్షేత్ర స్థాయిలో ఆ భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా సమగ్ర భూ సర్వే నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కూడా అన్ని పత్రాలను సరి చూసి ప్రక్రియ చేపట్టాలని అధికారులను సూచించారు. రాంపూర్ శివారులో చేపట్టే రీ సర్వేకు రైతులకు సహకరించాలన్నారు.
పత్తి కొనుగోళ్ల పరిశీలన
రేపల్లెవాడ శివారులోని మహేశ్వరి కాటన్మిల్లును సందర్శించిన కలెక్టర్ పత్తి కొనుగోళ్లను పరిశీలించారు. నిబంధనల ప్రకారం నాణ్యతతో పత్తిని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో త్వరగా డబ్బులు జమచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తంగళ్లపల్లి జడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్మిస్తున్న షెడ్యూల్ తెగల సంక్షేమ వసతి గృహ భవన నిర్మాణ పనులకు, కేజీబీవీ విద్యాలయంలో చేపడుతున్న కిచెన్ నిర్మాణ పనులను పరిశీలించి స్పీడప్ చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్‌కుమార్, తహసీల్దార్ జ్యోత్స్న, సర్వే అండ్ల్యాండ్రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
