మంచిర్యాల: ఎంపీ ఫ్లెక్సీలు తొలగించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ నర్సింగ్ 

మంచిర్యాల: ఎంపీ ఫ్లెక్సీలు తొలగించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ నర్సింగ్ 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్​లో జరిగిన గ్రీవెన్స్​లో కలెక్టర్ కుమార్ దీపక్​ను ఎస్సీ సెల్​ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఎంపీ పర్యటన సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఇందారం ఎక్స్​రోడ్డు నుంచి మంచిర్యాల వరకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. కానీ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్​ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఆ ఫ్లెక్సీలను దొంగల్లాగా రాత్రికి రాత్రి తొలగించారని మండిపడ్డారు. దీనికి బాధ్యులైన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, కమిషనర్​ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకోకపోతే జాతీయ ఎస్సీ కమిషన్​కు ఫిర్యాదు చేస్తామన్నారు. 

కొంతమంది దళిత నాయకులు దొరల పంచన చేరి దళిత ఎంపీని అవమానించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాకా వెంకటస్వామి కుటుంబం ప్రజాసేవకే అంకితమని, రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. నాయకులు పొట్ట మధుకర్, పాముల వెంకటేశ్, జుంజుపల్లి నర్సింగ్, దమ్మ సునీల్, దమ్మాల నారాయణ, కాంపెల్లి సతీశ్, ప్రకాశ్, కమలాకర్, దయాకర్, ఆవునూరి రవి పాల్గొన్నారు.