- వాయు కాలుష్యంతో రోగాల బారినపడుతున్న జనాలు
- ఎన్జీటీ ఆదేశాలనూ పట్టించుకోని మున్సిపల్ ఆఫీసర్లు
- హామీ ఇచ్చి చేతులెస్తున్న లీడర్లు
- మంచిర్యాల కార్పొరేషన్ అయినా నగర వాసులకు తీరని కష్టాలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శాశ్వత డంపింగ్ యార్డ్ లేకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక అండాళమ్మ కాలనీలోని తాత్కాలిక డంపింగ్ యార్డులో చెత్తను కాల్చడం వల్ల విషవాయువులు వెలువడి రోగాలబారిన పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు.
పిల్లల కోసం చాలా ఇండ్లలో నెబ్యులైజర్లు వాడుతున్నారంటే వాయు కాలుష్యం ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిసారి ఎన్నికల సందర్భంగా డంపింగ్ యార్డును షిఫ్ట్ చేస్తామని లీడర్లు హామీలిచ్చి ఆ తరువాత చేతులెత్తేస్తున్నారని జనం మండిపడుతున్నారు.
పొగతో ఉక్కిరిబిక్కిరి
అండాళమ్మ కాలనీలోని రెండెకరాల విస్తీర్ణంలో 2000 సంవత్సరంలో తాత్కాలిక డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. మంచిర్యాలలో రోజుకు దాదాపు 50 మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతుండగా, దాన్ని డంపింగ్ యార్డులో గుట్టలుగా పోస్తున్నారు. పేరుకుపోతున్న చెత్త కుప్పలను కాల్చివేస్తున్నారు. అందులో ఉండే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ప్రమాదకరమైన విషవాయువులు వెలువడుతున్నాయి.
రాత్రీపగలు తేడా లేకుండా దట్టమైన పొగలు ఆండాలమ్మ కాలనీతో పాటు గ్రీన్ సిటీ, పవర్ సిటీ, రంగంపేట, లక్ష్మీనగర్, వికాస్‌నగర్, పాత మంచిర్యాల ప్రాంతాలను కమ్మేస్తున్నాయి. దీంతో ఊపిరిసలపని పరిస్థితి నెలకొంటుందని ప్రజలు వాపోతున్నారు. ఈ విషవాయువుల ప్రభావంతో పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. డాక్టర్ల సూచన మేరకు పలువురు నెబ్యులైజర్లు వాడుతూ ఉపశమనం పొందుతున్నారు.
షిఫ్టింగ్ పై నిర్లక్ష్యం
అండాళమ్మ కాలనీ నుంచి డంపింగ్ యార్డును వేరే చోటికి తరలించాలని కాలనీవాసులు సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకుంటున్నా వారి గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు. 2023 సెప్టెంబర్‌లో సామాజిక కార్యకర్త నయీమ్ పాషా ఈ సమస్యపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేశారు. దీంతో 2024 మార్చి 31న స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ హనుమంతరెడ్డి, బోర్డ్ ఆఫీసర్ లక్ష్మీప్రసాద్ డంపింగ్ యార్డును సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు.
కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే డంపింగ్ యార్డును అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. మూడు నెలల్లో శ్రీరాంపూర్ కు తరలిస్తామని అధికారులు పేర్కొ న్నారు. ఇప్పటికి రెండేండ్లు కావస్తున్నా ఎలాంటి పురోగతి లేదని ప్రభావిత ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. పైగా చెత్తను కాల్చడం లేదని ఎన్జీటీకి తప్పుడు రిపోర్టు పంపి డంపింగ్ యార్డును షిఫ్ట్ చేయకుండా చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు.
బయోమైనింగ్ పేరిట కోట్లు వృథా..
మున్సిపల్ అధికారులు డంపింగ్ యార్డులో గుట్టలుగా పేరుకుపోతున్న చెత్తను సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే కొంతవరకు పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. కానీ అది చేయకుండా బయోమైనింగ్ పేరిట రూ.కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.
బయోమైనింగ్ కాంట్రాక్ట్తీసుకున్న హైదరాబాద్ కు చెందిన సాగర్ మోటార్స్ కు ఇప్పటికే రూ.లక్షల్లో బిల్లులు చెల్లించగా.. తాజాగా మరో రూ.1.24 కోట్ల బిల్లు చెల్లించడానికి ఫైల్ రెడీ చేసినట్టు తెలిసింది. ఓవైపు బయోమైనింగ్ చేస్తూనే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా చెత్తను తొలగిం చాలి. కానీ ఆ పని చేయకుండా చెత్తను కాల్చడం వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది.
20 ఏండ్లుగా అవస్థలు
మా కాలనీ పక్కనే తాత్కాలిక డంపింగ్ యార్డు ఏర్పాటు చేసిన్రు. దుర్వాసన, పొగ భరించలేకపోతున్నాం. రాత్రిళ్లు అయితే నరకం అనుభవిస్తున్నాం. కాలనీలో పిల్లలు, వృద్ధులు ఊపిరితిత్తుల రోగాల బారిన పడుతున్నారు. పిల్లల కోసం చాలా ఇండ్లలో నెబ్యులైజర్లు వాడుతున్నారు. ఎన్నిసార్లు ధర్నాలు చేసినా పట్టించుకోవడం లేదు.
- నాగేశ్వర్రావు, అండాలమ్మ కాలనీ, మంచిర్యాల
డంప్ యార్డును షిఫ్ట్ చేయాలె...
అండాలమ్మ కాలనీలో ఉన్న డంపింగ్ యార్డు వల్ల మా కాలనీ వాళ్లం అవస్థలు పడుతున్నాం. నిత్యం పొగ కాలనీని కమ్మేయడం వల్ల దుర్వాసన భరించలేకపోతున్నాం. రాత్రిళ్లు ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ప్రజలు రోగాల పాలవుతున్నారు. డంపింగ్ యార్డును వెంటనే ఇక్కడి నుంచి తరలించాలె. - రమణారావు, గ్రీన్‌సిటీ, మంచిర్యాల
