ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలి

 ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలి
  • మంచిర్యాల ఎమ్మెల్యే ఇంటి ముందు వరద బాధితుల ధర్నా 
  • ఒక్కో ఇంటికి 5 నుంచి 10 లక్షల నష్టం జరిగిందని ఆవేదన
  • బాధితులను బలవంతంగా పంపించిన టౌన్​సీఐ

మంచిర్యాల, వెలుగు: వరదలకు నష్టపోయిన తమకు పరిహారం అందించాలని, ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వరద బాధితులు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు ఇంటి ముందు ఆదివారం ధర్నా చేశారు. వరదలతో సర్వస్వం కోల్పోయిన తమను ఎమ్మెల్యే, ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వరద సాయం కోసం సీఎం కేసీఆర్​ను కలిసి విన్నవించినప్పటికీ దివాకర్​రావు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. కాళేశ్వరం బ్యారేజీల బ్యాక్ వాటర్ తోనే పట్టణంలోని ఎన్టీఆర్​నగర్, రాంనగర్, ఎల్​ఐసీ కాలనీ, పద్మశాలి కాలనీ, ఆదిత్య ఎన్​క్లేవ్​ తదితర ఏరియాలు ముంపునకు గురయ్యాయని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుస్తుగా అప్రమత్తం చేయకపోవడం వల్లే తాము సర్వస్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలకు ఇండ్లలోని విలువైన సామాన్లన్నీ కొట్టుకపోయి కట్టుబట్టలతో మిగిలామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నష్టం జరిగిందని వాపోయారు. సెప్టెంబర్​ వరకు భారీ వర్షాలు ఉండడంతో మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం గోదావరి, రాళ్లవాగుకు కరకట్టలు నిర్మించి కాలనీలు మునిగిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. కాగా బాధితులు ధర్నా చేసిన సమయంలో ఎమ్మెల్యే దివాకర్​రావు తన ఇంట్లో లేరు. ఎమ్మెల్యే నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో భవిష్యత్తులో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు. సమాచారం అందుకున్న టౌన్​ సీఐ నారాయణ నాయక్​ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వరద బాధితులను బలవంతంగా అక్కడి నుంచి పంపించారు.