దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలా క్రీడా పోటీలు : కలెక్టర్ పి.చంద్రయ్య

దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలా క్రీడా పోటీలు : కలెక్టర్ పి.చంద్రయ్య
  •     అడిషనల్​ కలెక్టర్ పి.చంద్రయ్య
  •     జిల్లాస్థాయి పోటీలు ప్రారంభం

నస్పూర్, వెలుగు: దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలా జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించామని మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ మైదానంలో జిల్లా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్​జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆటల  పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. 

జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి హనుమంత రెడ్డి, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్ తో కలిసి అడిషనల్​కలెక్టర్ జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని దివ్యాంగులకు జూనియర్స్ (18 సంవత్సరాల లోపు) సీనియర్స్ (18–54) మహిళలు, పురుషులకు వేర్వేరుగా వివిధ విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

జిల్లా స్థాయిలో గెలుపొందినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అంధులకు రన్నింగ్, షార్ట్ పుట్, చెస్, బధిరులకు రన్నింగ్, షార్ట్ పుట్, జావెలిన్ త్రో, శారీరక దివ్యాంగులకు షార్ట్ పుట్, జావెలిన్ త్రో, క్యారమ్స్, బుద్ధి మాంద్యంవారికి రన్నింగ్, షార్ట్ పుట్ విభాగాల్లో పోటీలు నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు

బజార్ హత్నూర్, వెలుగు: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ లో భవిత కేంద్రం ఆధ్వర్యంలో దివ్యాంగ బాలబాలికలకు మంగళవారం ఆటలపోటీలు నిర్వహించారు. దివ్యాంగ విద్యార్థుల కోసం పాఠశాలల్లో భవిత కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు హెచ్​ఎం భూమన్న తెలిపారు.