మంచిర్యాల రైల్వే స్టేషన్​కు ఇక మంచిరోజులు

మంచిర్యాల రైల్వే స్టేషన్​కు ఇక మంచిరోజులు
  • అమృత్​ భారత్​ స్టేషన్​ స్కీంలో అభివృద్ధికి ఎంపిక
  • త్వరలోనే అన్ని రకాల వసతులతో మారనున్న రూపురేఖలు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల రైల్వేస్టేషన్ లో సమస్యలు తీరనున్నాయి. ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి అమృత్​ భారత్​ స్టేషన్​ స్కీం కింద ఈ స్టేషన్​ను కేంద్రం ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్లను సెలెక్ట్​ చేయగా.. ఇందులో మంచిర్యాల స్టేషన్​ సెకండ్​ ఫేస్​లో ఎంపికైంది.

ప్రపోజల్స్​ పంపిన అధికారులు ..

అమృత్​స్టేషన్​ స్కీమ్​కు ఎంపికవడంతో స్టేషన్​లో చేయాల్సిన పనుల ప్రపోజల్స్​ను అధికారులు కేంద్రానికి పంపించారు. మూడు ప్లాట్​ఫామ్స్​ ఉండగా, ఫస్ట్​ ప్లాట్​ఫామ్​పై మాత్రమే టికెట్​ కౌంటర్లు ఉన్నాయి. సెకండ్​, థర్డ్​ ప్లాట్​ఫామ్స్​పై టికెట్​ కౌంటర్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.స్టేషన్​లో ప్రయాణికులు కూర్చోవడానికి బెంచీలు కూడా లేవు. సెకండ్​, థర్డ్​ ప్లాట్​ఫామ్స్​పై రెస్ట్​రూమ్​లు, టాయ్​లెట్లు, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఒక ఫూట్​ ఓవర్​ బ్రిడ్జి, రెండు లిఫ్టులు మాత్రమే ఉన్నాయి. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్​ చైర్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరో ఫూట్​ ఓవర్​ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. స్టేషన్​లో దొంగల బెడద ఉన్నప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల నైట్​ టైమ్​లో మహిళలు భయాందోళన చెందుతున్నారు. 

రద్దీ స్టేషన్​.. 

మంచిర్యాల నుంచి ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ ఉంది. దీంతో ఇక్కడ రోజూ వేల సంఖ్యలో ప్రయాణికుల  రద్దీ ఉంటుంది. చుట్టుపక్కల స్టేషన్లలో ఆగని ప్యాసింజర్​, ఎక్స్​ప్రెస్​, సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​ రైళ్లకు హాల్టింగ్​ ఉండడం వల్ల ప్రయాణికుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పాటు మంచిర్యాల రైల్వేస్టేషన్​ సింగరేణి పారిశ్రామిక ప్రాంతానికి సెంటర్​ పాయింట్ గా ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది ఇక్కడ స్థిరపడ్డారు. అంతేగాకుండా రాజస్థాన్​, గుజరాత్​ రాష్ర్టాల ప్రజలు మంచిర్యాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్​, బీహార్​, ఒడిశా, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ నుంచి వేలాది మంది ఉపాధి కోసం ఇక్కడికి వలస వస్తుంటారు. సింగరేణి, ఎస్టీపీపీ, ఓరియంట్​ సిమెంట్​, సిరామిక్స్​, రైస్​మిల్స్​ వంటి ఇండస్ర్టీస్​తో పాటు హోటల్స్​, కన్​స్ర్టక్షన్​ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఈ కారణాల వల్ల మంచిర్యాల స్టేషన్​కు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు రైల్వేస్టేషన్​లో సరైన సౌకర్యాలులేక ప్రయాణికులు పడ్డ ఇబ్బందులు అమృత్​ స్టేషన్​ స్కీమ్​ తో తీరుతాయని అధికారులు అంటున్నారు.

ఇక కొత్త హంగులు 

అమృత్​ భారత్​ స్టేషన్​ స్కీం కింద పలు అభివృద్ధి పనులు చేపట్టనుండడంతో స్టేషన్​లో ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రెస్ట్​రూమ్​లు, టాయ్​లెట్లు, డ్రింకింగ్​ వాటర్​ సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు పాటు సీసీ కెమెరాలు సైతం పెట్టనున్నారు. అలాగే స్టేషన్​ బయట వెహికల్​ పార్కింగ్​, షాపింగ్​ జోన్స్​ కోసం స్థలం కేటాయించి అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇంకా అవసరమైన వివిధ సౌలత్​లు కల్పించనున్నారు. దీంతో త్వరలోనే మంచిర్యాల రైల్వేస్టేషన్​ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.