వర్షం నీటిని ఒడిసి పట్టేలా!.. జల సంరక్షణ పనుల్లో మంచిర్యాల జిల్లా ఆదర్శం

వర్షం నీటిని ఒడిసి పట్టేలా!.. జల సంరక్షణ పనుల్లో మంచిర్యాల జిల్లా ఆదర్శం
  • జేఎస్​జేబీ స్కీమ్​లో 84,482 పనులతో రికార్డు
  • జాతీయ అవార్డు కింద రూ.2 కోట్ల క్యాష్ ప్రైజ్
  • జల సంరక్షణ పనులతో పెరిగిన గ్రౌండ్ వాటర్ 
  • ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు సైతం అవార్డులు

మంచిర్యాల, వెలుగు : కేంద్ర ప్రభుత్వం భూగర్భ జలాల పెంపుతోపాటు వాటి పరిరక్షణ కోసం నాలుగేండ్లుగా అమలు చేస్తున్న జల్ సంచయ్ జన్ బాగీధారి స్కీమ్​లో మంచిర్యాల జిల్లా మెరుగైన ప్రగతి సాధించింది. 2024–25లో జిల్లావ్యాప్తంగా 84,482 పనులు చేపట్టి ఆదర్శంగా నిలిచింది. ఇందుకుగాను జాతీయ స్థాయిలో అవార్డు సాధించింది. దీని కింద కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ.2 కోట్ల క్యాష్  ప్రైజ్​ను ఇటీవల ప్రకటించింది. మంచిర్యాలతోపాటు ఆదిలాబాద్ జిల్లా సైతం ఈ అవార్డుకు సెలెక్ట్ అయ్యింది. నిర్మల్ జిల్లాకు రూ.కోటి నగదు పురస్కారం దక్కింది. 

జిల్లాలో 84,482 పనులు..

వాన నీటిని ఒడిసి పట్టి భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంపొందించడం జల్ సంచయ్ జన్ బాగీధారి స్కీమ్ ప్రధాన ఉద్దేశం. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ, పీఎంకేఎస్​వై పథకాల ద్వారా జల సంరక్షణకు వివిధ పనులు చేపట్టారు. 

ఇందులో ముఖ్యంగా బోర్వెల్ రీచార్జ్ స్ర్టక్చర్స్, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ర్టక్చర్స్, కమ్యూనిటీ సోక్ పిట్స్, వ్యక్తిగత సోక్ పిట్స్, చెక్ డ్యామ్స్, పర్క్యులేషన్ ట్యాంక్స్, ఫామ్ పాండ్స్, ట్రెంచెస్, మినీ పర్క్యులేషన్ ట్యాంక్స్ నిర్మించారు. జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష వర్క్స్ చేపట్టగా, 84,482 పనులను పూర్తి చేశారు. కలెక్టర్ కుమార్ దీపక్ ప్రోత్సాహంతో డీఆర్డీవో కిషన్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు ఉత్సాహంగా జల సంరక్షణ పనుల్లో భాగం పంచుకున్నారు. 

జాతీయ అవార్డుకు ఎంపిక.. 

కేంద్ర ప్రభుత్వం జల సంరక్షణ చర్యలను మరింత ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో అవార్డులను ప్రకటించింది. ఇందుకోసం జిల్లాలో చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు జేఎస్​జేబీ పోర్టల్​లో ఫొటోలతోపాటు అప్లోడ్ చేశారు. ఈ పనులను మినిస్ర్టీ ఆఫ్ రూరల్ డెవలప్​మెంట్ సైంటిస్టులతో తనిఖీ చేయించింది. సైంటిస్ట్ కొల్లి రాంబాబు గత జూన్ 19 నుంచి జూలై 12 వరకు జిల్లాలో పర్యటించి జల సంరక్షణకు చేపట్టిన వివిధ పనులను తనిఖీ చేశారు. వీటివల్ల ఆయా మండలాల్లో గ్రౌండ్ వాటర్ పెరగడమే కాకుండా రైతులకు పంట దిగుబడి కూడా పెరిగినట్టు గుర్తించారు. ఈ రిపోర్ట్ ఆధారంగా సౌత్ జోన్ కేటగిరీలో మంచిర్యాల జిల్లాకు జాతీయ అవార్డు దక్కింది. 

వర్షం నీటిని ఒడిసిపట్టేలా..

వాన నీటితోపాటు వృథా నీటిని బొట్టు బొట్టు ఒడిసి పట్టేలా జల సంక్షరణ పనులు చేపట్టారు. ఇండ్లలో వాన నీటి సంరక్షణకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ర్టక్చర్స్, పొలాలు, అడవుల్లో భూగర్భ జలాల పెంపుతోపాటు పంటల వినియోగం కోసం పర్కులేషన్ ట్యాంకులు, వాగులపై మినీ చెక్ డ్యామ్​లు నిర్మించారు. వీటిలో మచ్చుకు కొన్ని పరిశీలిస్తే... వేమనపల్లి మండలం దస్నాపూర్ పంచాయతీ పరిధిలో రూ.3 లక్షలతో పర్కులేషన్ ట్యాంక్ నిర్మించగా, జైపూర్ మండలం మిట్టపల్లి పంచాయతీ పరిధిలో రూ.4.50 లక్షలతో వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు. 

అలాగే కోటపల్లి పంచాయతీ పరిధిలో రూ.3 లక్షలతో పర్కులేషన్ ట్యాంక్, తాండూర్ మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధి పెగడపల్లిలో రూ.4లక్షలతో ఫామ్ పాండ్ నిర్మించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెరిగినట్టు సైంటిస్టుల తనిఖీల్లో  రుజువైంది. 

గ్రౌండ్ వాటర్ పెరిగింది... 

భూమిపై ఉన్న సకల జీవరాశులకు జలమే ఆధారం. అలాంటి జల వనరులను పొదుపుగా వాడుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిది. వాన నీటిని, వృథాగా పోతున్న నీటిని ఒడిసిపడితే భూగర్భ జలాలు పెరుగుతాయి. జిల్లాలో చేపట్టిన పనుల ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగినట్టు సైంటిస్టులు గుర్తించారు. ఇది ప్రస్తుతం వ్యవసాయ దిగుబడలకే కాకుండా భావితరాలకు ఉపయోగపడుతుంది. జిల్లాకు జాతీయ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. - కుమార్ దీపక్, మంచిర్యాల కలెక్టర్