మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాను 2022 సంవత్సరంలో అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపడానికి కృషి చేశామని కలెక్టర్భారతి హోళికేరి చెప్పారు. ముఖ్యంగా విద్య, వైద్యం, సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్లను పూర్తి చేశామని వివరించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రజల సహకారంతోనే ఈ సక్సెస్ సాధించామని తెలిపారు. శనివారం ఆమె 'వెలుగు'తో మాట్లాడుతూ... గత ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి ఎంతో సంతృప్తిని మిగిల్చిందని వివరించారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
మెరుగైన వైద్యసేవలు...
గత సంవత్సరం జిల్లాలో మాతా శిశు ఆరోగ్యకేంద్రం (ఎంసీహెచ్), మెడికల్, నర్సింగ్ కాలేజీలను ప్రారంభించి వైద్యసేవలను మెరుగుపర్చామని కలెక్టర్ తెలిపారు. రూ.17 కోట్లతో ఎంసీహెచ్ నిర్మాణం పూర్తి చేసి నిరుడు మార్చిలో ప్రారంభోత్సవం చేసి మాతా శిశువులకు మెరుగైన వైద్యసేవలను అందించామన్నారు. దురదృష్టవశాత్తూ జూలైలో వచ్చిన వరదలకు ఎంసీహెచ్ మునగడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
- కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మెడికల్ కాలేజీకి పర్మిషన్ సాధించామని, గత నెలలో అడ్మిషన్లు పూర్తయి క్లాస్‌లు నడుస్తున్నాయని అన్నారు. దీనికి అనుబంధంగా 350 బెడ్స్ హాస్పిటల్, స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ రావడంతో ప్రజలకు మల్టీస్పెషాలిటీ సర్వీసులు అందుతున్నాయని వివరించారు. మెడికల్, నర్సింగ్ కాలేజీలకు పర్మినెంట్ బిల్డింగ్ కోసం స్థల సేకరణ చేసి గవర్నమెంట్‌కు పంపామని, పర్మిషన్లు రాగానే పనులు స్టార్ట్ చేస్తామని వెల్లడించారు. బెల్లంపల్లిలో 100 బెడ్స్ హాస్పిటల్‌ను ప్రారంభించామని, చెన్నూర్, లక్సెట్టిపేటలో భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు.
- ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో నార్మల్ డెలివరీలను పెంచడానికి చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. సీ సెక్షన్లను 70 నుంచి 67 శాతానికి తగ్గాయన్నారు. సాధారణ కాన్పులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
వసతులు, బోధనపై దృష్టి...
మన ఊరు – మన బడి ప్రోగ్రాం ద్వారా సర్కారు స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని కలెక్టర్ చెప్పారు. గత సంవత్సరం ఫస్ట్ ఫేస్‌లో 248 స్కూళ్లను ఎంపిక చేసి 12 రకాల పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద మండలానికి రెండు స్కూళ్లలో చేపడుతున్న పనులు త్వరలోనే పూర్తవుతాయని అన్నారు. ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లలో బోధన, అభ్యసనాలను పెంచడం కోసం ఎఫ్ఎల్ఎన్, హైస్కూల్ స్టూడెంట్లలో నైపుణ్యాలను పెంచడం కోసం లిటిల్ లీడర్ – లిటిల్టీచర్ ప్రోగ్రాంలను అమలు చేస్తున్నామని వివరించారు. ఈ విద్యాసంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
మెరుగైన సంక్షేమం...
గతేడాది కొవిడ్ వ్యాక్సినేషన్ టార్గెట్ పూర్తి చేశామని కలెక్టర్ భారతీ హోలికెరి తెలిపారు. దళితబంధు కింద 313 యూనిట్లను అందించామని, సెకండ్ ఫేస్ కోసం రెడీ అవుతున్నామని కలెక్టర్ తెలిపారు. రెండో విడత కంటి వెలుగు ప్రోగ్రాం ఈ నెల 18న స్టార్ట్ కానుందని, ఈసారి టీంల సంఖ్య పెంచామని అన్నారు. సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి జీవో 76 కింద పట్టాలు ఇచ్చామని, మిగతా వారికి ఈ ఏడాదిలో అందిస్తామని చెప్పారు. 58, 59 జీవోల కింద సర్కారు స్థలాల రెగ్యులరైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ధరణి పోర్టల్‌లో 30కి పైగా మాడ్యూల్స్‌పై వస్తున్న పిటీషన్లను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో గ్రామాలు, మున్సిపాలిటీల్లో డెవలప్మెంట్ జరిగిందని, పెండింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు. కొత్త సంత్సరంలో తలపెట్టిన పనులు సక్సెస్ చేయడం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు.