
మూసివేత దిశగా ఎంసీసీ!
ఏడాదిన్నరగా ప్లాంట్ బ్రేక్‌డౌన్
మసకబారుతున్న 60 ఏండ్ల చరిత్ర
కార్మికులను క్వార్టర్ల నుంచి పంపించే యత్నం
వందల కోట్ల ఆస్తుల అమ్మకంకోసమేనని ఆరోపణలు
మంచిర్యాల, వెలుగు: ఏడాదిన్నర కాలంగా సిమెంట్ ఉత్పత్తి నిలిపివేసిన మంచిర్యాల సిమెంట్ కంపెనీ(ఎంసీసీ) మేనేజ్మెంట్దశలవారీగా కంపెనీని క్లోజ్చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఏసీసీగా ఉన్నప్పుడు వెయ్యికిపైగా కార్మికులు ఉండగా క్రమంగా 95కు కుదించారు. గత నెలలో రీట్రెంచ్మెంట్యాక్ట్ పేరుతో 20 మందిని తొలగించడంతో వారు లేబర్ కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా, కరెంటు బిల్లుల బకాయిల పేరుతో ఎంసీసీ కాలనీ నుంచి కార్మికులను పంపించేందుకు మేనేజ్మెంట్ ఎత్తుగడ వేసినట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. కరోనా కారణంగా ప్లాంట్‌ను ఇప్పట్లో పునరుద్ధరించలేమని,మరోవైపు విద్యుత్‌శాఖ ఆఫీసర్లు కరెంట్కనెక్షన్తొలగించేందుకు నోటీసులు జారీ చేశారని మేనేజ్మెంట్ పేర్కొంటోంది. కార్మికులు, కాలనీలోని కిరాయిదారులు ఈ నెల 23లోగా క్వార్టర్లు ఖాళీ చేసి ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఇటీవల నోటీసు జారీ చేసింది. కంపెనీని పూర్తిగా క్లోజ్‌చేసి విలువైన భూములను రియల్వెంచర్లుగా మార్చే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్లు ఈ పరిణామాలను గమనిస్తున్న కార్మికులు, తెలంగాణ సిమెంట్ వర్కర్స్ యూనియన్ లీడర్లు ఆరోపిస్తున్నారు.
కరెంటు బిల్లుల బకాయి రూ.11 కోట్లు
ఏండ్ల తరబడి కోట్లలో పేరుకుపోయిన కరెంటు బిల్లుల చెల్లింపుపై ఎంసీసీ మేనేజ్మెంట్ చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం రూ.11 కోట్ల కరెంటు బిల్లులు, రూ.40 లక్షల మున్సిపల్ట్యాక్సులు పేరుకుపోయాయి. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ ఆఫీసర్లు గత నెలలో నోటీసులు జారీ చేసి క్వార్టర్లకు కరెంటు కట్ చేశారు. ఎంసీసీ కాలనీలో కలెక్టర్, డీసీపీ క్యాంప్ఆఫీసులతో పాటు పలువురు ఆఫీసర్ల ఇండ్లు ఉండడంతో వెంటనే పునరుద్ధరించారు. అనంతరం కరెంటు బిల్లులను దశలవారీగా చెల్లించేందుకు కోర్టు నుంచి స్టే పొందిన యాజమాన్యం మొదటి విడతగా రూ.50 లక్షలు చెల్లించింది. ఈ నెల 23న రెండవ విడత బకాయిలు చెల్లించాల్సి ఉండగా, ఆలోపే క్వార్టర్లను ఖాళీ చేయాలంటూ నోటీసు జారీ చేసింది. అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ చెల్లించేందుకు సిద్ధంగా లేనట్లు స్పష్టమవుతోంది. ప్లాంట్‌ను మూసివేసే ఆలోచనలో భాగంగా కార్మికులను పొమ్మనలేక పొగపెడుతోందని వాపోతున్నారు. ఎన్నో ఏండ్లుగా కంపెనీని నమ్ముకున్న తాము ఉన్నఫళంగా కుటుంబాలతో ఎక్కడికి వెళ్లాలని ఆందోళన చెందుతున్నారు. క్వార్టర్ల రెంట్ ద్వారా నెలనెలా ఆదాయం వస్తున్నా బకాయిలు చెల్లించకుండా తమను రోడ్డున పడేయడం తగదని మండిపడుతున్నారు.
నాడు ఘనం.. నేడు దయనీయం
మంచిర్యాలలో1956లో అసోసియేటెడ్సిమెంట్కంపెనీ(ఏసీసీ)ని అత్యాధునిక జర్మన్టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. గతంలో సిమెంట్‌రంగంలో ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలను ఏసీసీ ఇక్కడే చేపట్టి సక్సెస్ సాధించింది. ఓఎన్జీసీ వంటి సంస్థలు సముద్రగర్భంలో ఉపయోగించే ఆయిల్వెల్సిమెంట్ను మొదటఈ ప్లాంట్‌లోనే తయారు చేయడంతోపాటు కార్మికులకు వేజ్ బోర్డు అమలు చేసి ఇతర పరిశ్రమల కన్నా అత్యధిక జీతాలు ఇచ్చిన చరిత్ర ఏసీసీకి ఉంది. 2006లో దీనిని కొంతమంది పారిశ్రామికవేత్తలకు రూ.34 కోట్లకు కారుచౌకగా అమ్మేశారు. వారు మంచిర్యాల సిమెంట్కంపెనీ(ఎంసీసీ)గా పేరు మార్చి నిర్వహిస్తున్నారు. ఎంసీసీగా మారిన తర్వాత కార్మికులను కుదించుకుంటూ వస్తున్నారు. వేజ్‌బోర్డు కాదు కదా కనీస వేతనాలు కూడా లభించడం లేదు. అవి కూడా మూడు నాలుగు నెలలకోసారి చెల్లిస్తున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్అందక కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. రోజుకు వెయ్యి టన్నుల సిమెంట్ఉత్పత్తితో లాభాల్లో నడుస్తున్న ప్లాంట్‌ను ప్లాన్ప్రకారం గత ఏడాది జులై నుంచి బ్రేక్‌డౌన్ చేశారు. ఓల్డ్మిషనరీ, మార్కెట్లో ఒడిదుడుకుల వల్ల నష్టాలు వస్తున్నాయని మేనేజ్మెంట్పేర్కొంది.
క్వార్టర్లు, స్థలాలు రెంట్‌కు…
ఎంసీసీ కాలనీని జర్మన్ టెక్నాలజీతో ఆధునిక హంగులతో నిర్మించారు. ఇందులో విశాలమైన రోడ్లు, సుమారు 400 క్వార్టర్లు
ఉన్నాయి. పార్కులు, స్పోర్స్ట్ స్టేడియాలు, ఈఎస్ఐ డిస్పెన్సరీ, క్యాంటీన్, పోస్టాఫీస్, క్లబ్ అన్నీ మూతపడ్డాయి. ఖాళీ క్వార్టర్లను
రెంట్‌కు ఇచ్చారు. కలెక్టర్, డీసీపీ క్యాంప్ ఆఫీసులతో పాటు పలువురు ఆఫీసర్లు ఈ క్వార్టర్లలో రెంట్‌కు ఉంటున్నారు. అలాగే గెస్ట్‌హౌస్‌తో పాటు ఆఫీసర్ల క్వార్టర్లను 363 ఎన్హెచ్ నిర్మాణ సంస్థకు, ఖాళీ స్థలాలను లారీల పార్కింగ్ కోసం రెంట్‌కు ఇచ్చారు. ప్రస్తుతం 80 మంది కార్మికులు మాత్రమే క్వార్టర్లలో ఉంటున్నారు. యాభైకి పైగా క్వార్టర్లు శిథిలమయ్యాయి.
మేనేజ్మెంట్ మొండివైఖరితో నష్టం
ఎంసీసీ మేనేజ్మెంట్మొండి వైఖరితో వ్యవహరిస్తోంది. లాభాల్లో నడుస్తున్న కంపెనీ ని క్లోజ్ చేసి, ఆ భూముల్లో రియల్వెంచర్ చేయాలనే ఆలోచనలో ఉంది. అరవై ఏండ్లకు పైగా ఎంతోమందికి ఎంసీసీ అన్నం పెట్టింది. మంచిర్యాల అభివృద్ధికి ఐకాన్‌గా నిలిచింది. అటు వంటి కంపెనీని క్లోజ్ చేసి కార్మికులను రోడ్డుపాలు చేస్తే ఊరుకోం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్దృష్టికి తీసుకెళ్లాం. ప్లాంట్‌ను పునరుద్ధరించి కార్మికులకు న్యాయం జరిగేదాకా కొట్లాడుతాం.
– గాజుల ముఖేష్ గౌడ్, తెలంగాణ సిమెంట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్