Dhanush: ట్రోలర్స్‌కు ధనుష్ దిమ్మతిరిగే కౌంటర్.. 'ఇడ్లీ కొట్టు' ఆడియో లాంచ్‌లో కామెంట్స్ వైరల్!

Dhanush: ట్రోలర్స్‌కు ధనుష్ దిమ్మతిరిగే కౌంటర్.. 'ఇడ్లీ కొట్టు' ఆడియో లాంచ్‌లో కామెంట్స్ వైరల్!

'కుబేర' సినిమాతో ఇటీవలే భారీ విజయాన్ని అందుకున్న తమిళ నటుడు ధనుష్.. ఇప్పుడు తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇడ్లీ కడై’ .  భారీ అంచనాలతో ఈ మూవీ ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది. అక్టోబర్ 1న విడుదల కానుంది.  తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ టైటిల్‌ తో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుకలో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 'ట్రోల్స్' గురించి ఆయన మాట్లాడిన తీరు చర్చనీయాంశమైంది.  

హేటర్స్ అనేవాళ్లే లేరు..

ఆడియో లాంచ్ ఈవెంట్‌లో ధనుష్ మాట్లాడుతూ, అసలు హేటర్స్ అనే కాన్సెప్టే లేదు. అందరూ హీరోల సినిమాలను చూస్తారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ద్వేషాన్ని ప్రదర్శిస్తారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 30 మందితో కూడిన ఒక బృందం 300 ఫేక్ ఐడీలను క్రియేట్ చేసుకొని, తమ వ్యక్తిగత మనుగడ కోసం హీరోలపై ద్వేషాన్ని వ్యాపింపజేస్తారని ఆయన చెప్పారు. ఆ 30 మంది కూడా చివరికి అందరి సినిమాలను చూస్తారు. మీరు బయట చూసే ఆన్ లైన్ ప్రపంచానికి, వాస్తవ ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది అని ధనుష్ వివరించారు. 

నిత్యా మీనన్‌తో మరోసారి..

 'ఇడ్లీ కొట్టు' సినిమాలో ధనుష్ సరసన నిత్యా మీనన్ నటించింది. వీరిద్దరి కలయికలో వచ్చిన 'తిరు' సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, ఇప్పుడు ఈ కొత్త చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో ధనుష్, నిత్యా మీనన్ కెమిస్ట్రీ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌‌‌‌కిరణ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని డాన్ పిక్చర్స్‌‌‌‌, వండర్‌‌‌‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్‌‌‌‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు.  తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ టైటిల్‌‌‌‌తో శ్రీ వేదాక్షరి మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై చింతపల్లి రామారావు  విడుదల చేస్తున్నారు.

ధనుష్‌కి దర్శకత్వంలో ఇది మూడో చిత్రం. ఇంతకు ముందు 'పవర్ పాండి', 'నానం ఒరు రౌడీ దాన్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి సత్తా చాటారు. ఇప్పుడు  'ఇడ్లీ కొట్టు'తో దర్శకుడిగా మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ధనుష్ నటనకు, దర్శకత్వానికి 'ఇడ్లీ కొట్టు' మంచి ఉదాహరణగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించనుందో చూడాలి.