దండేపల్లి కస్తూర్బాలో అక్రమాలు.. ఎంక్వైరీ చేసిన ఎమ్మెల్యే, డీఈవో

దండేపల్లి కస్తూర్బాలో అక్రమాలు.. ఎంక్వైరీ చేసిన ఎమ్మెల్యే, డీఈవో
  • స్పెషల్‌‌ ఆఫీసర్‌‌, ముగ్గురి సిబ్బందిని సర్వీస్‌‌ రిమూవల్‌‌ చేయాలని సిఫార్సు

దండేపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని కస్తూర్బా గాంధీ గర్ల్స్‌‌ హైస్కూల్‌‌లో అక్రమాలు జరుగుతున్నాయని, మెనూ పాటించడం లేదని ఫిర్యాదులు రావడంతో డీఈవో యాదయ్య, ఎమ్మెల్యే ప్రేమ్‌‌సాగర్‌‌రావు సోమవారం స్కూల్‌‌లో ఎంక్వైరీ చేపట్టారు. స్పెషల్‌‌ ఆఫీసర్‌‌, టీచింగ్, నాన్‌‌ టీచింగ్‌‌ స్టాఫ్‌‌తో పాటు స్టూడెంట్లను సుమారు మూడు గంటల పాటు విచారించారు. 

స్పెషల్‌‌ ఆఫీసర్‌‌ మంజుల, అసిస్టెంట్‌‌ కుక్‌‌, వాచ్‌‌ఉమెన్‌‌, స్కావెంజర్‌‌ తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, తమను, తమ తల్లిదండ్రులను అసభ్యకరంగా తిట్టడమే కాకుండా, తమతో టాయిలెట్లు, వాటర్‌‌ ట్యాంక్‌‌, క్లాస్‌‌రూమ్స్‌‌ కడిగిస్తున్నారని స్టూడెంట్లు ఫిర్యాదు చేశారు. నీళ్ల చికెన్‌‌ సూప్‌‌, ఉడికీ ఉడకని అన్నం పెడుతుండడంతో ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

దీంతో కస్తూర్బా సిబ్బందిపై ఎమ్మెల్యే, డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్‌‌ ఆఫీసర్‌‌ మంజులతో పాటు వర్కర్స్‌‌ భారతి, నీల, లక్ష్మిని వెంటనే సర్వీస్‌‌ రిమూవల్‌‌ చేయాలని ఎమ్మెల్యే సిఫారస్‌‌ చేయడంతో రిపోర్ట్‌‌ను కలెక్టర్‌‌కు పంపిస్తామని డీఈవో చెప్పారు. అలాగే సదరు సిబ్బంది స్కూల్‌‌ నుంచి వెళ్లిపోవాలంటూ, స్కూల్‌‌ పర్యవేక్షణను ఎంఈవో చిన్నయ్యకు అప్పగిస్తూ డీఈవో యాదయ్య ఆదేశాలు జారీ చేశారు. వారి వెంట ఎంపీడీఓ జేఆర్‌‌. ప్రసాద్‌‌, ఎంఈవో దుర్గం చిన్నయ్య, సెక్టోరియల్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి ఉన్నారు.

విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే సహించేది లేదు : ఎమ్మెల్యే ప్రేమ్‌‌సాగర్‌‌రావు

విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌‌సాగర్‌‌రావు హెచ్చరించారు. దండేపల్లి కస్తూర్బా గాంధీ స్కూల్‌‌పై వచ్చిన ఫిర్యాదులను విచారించి బాధ్యులైన సిబ్బందిపై చర్యలు చేపట్టామన్నారు. స్టూడెంట్ల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే... కింది స్థాయి సిబ్బంది స్టూడెంట్స్‌‌ పొట్టగొట్టడం సరికాదన్నారు. అక్రమాలకు పాల్పడే వారిని సర్వీస్‌‌ రిమూవల్‌‌ చేయడంతో పాటు క్రిమినల్‌‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.