మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల సబ్ రిజిస్ర్టార్ ఆఫీసులో అనుమానాస్పద లావాదేవీలు బయటపడ్డాయి. శుక్రవారం సాయంత్రం ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఓ జూనియర్ అసిస్టెంట్ యూపీఐ అకౌంట్లో లెక్కలో లేని రూ.70 వేలను అధికారులు గుర్తించారు. ఇది లంచమేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇలానే మరో ఇద్దరి ఖాతాల్లోనూ లావాదేవీలను గుర్తించినట్టు సమాచారం.
పెన్సిల్రాతలు గల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సాయంత్రం 7 గంటలకు సబ్ రిజిస్ర్టార్ ప్రియాంకను నస్పూర్‌లోని ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లి విచారించారు. ఆ తరువాత మంచిర్యాలలోని ఆమె నివాసంలో సోదాలు చేశారు. ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు రెగ్యులర్ఉద్యోగులు, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా లంచాలు వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకరు డాక్యుమెంట్ రైటర్ల దగ్గర లంచం వసూలు చేస్తే... మరొకరు ఆ డబ్బులను అధికారులు, సిబ్బందికి పంపకాలు చేస్తారని సమాచారం. ఇల్లీగల్ లే ఔట్లలో ప్లాట్లు రిజిస్ర్టేషన్ చేయడానికి ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.30 వేల నుంచి రూ.40 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిపై ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు.
