
హుజూర్ నగర్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాని మోడీని కలిసి రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ వినతి పత్రం ఇచ్చారని అన్నారు MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. ఉస్మానియా యునివర్సిటీ గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించిన ఆయన…. ప్రధాని మోడీని కేసీఆర్ కలవడం ఎన్నికల స్టంట్ అని అన్నారు. వినతి పత్రంలో SC, ST, BC, సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలు, న్యాయ శాఖలకు సంబంధించిన అంశాలు ఉన్నాయని చెప్పారు. అయితే వాటిని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. కానీ… తన డిమాండ్ లను పరిష్కరిస్తే అది తన ఘనత అని.. లేకుంటే కేంద్రంపై తప్పు మోపడానికి ఇది కేసీఆర్ పన్నిన పథకమని అన్నారు మంద కృష్ణ.
సామాజిక అంశాలపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని అన్నారు మందకృష్ణ. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరినట్టు తాము కూడా రాష్ట్ర మంత్రి వర్గంలో కూడా రిజర్వేషన్ కు తగ్గట్టు SC, ST, BC, మైనార్టీలకు మంత్రి వర్గం లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి వర్గంలో ఒక్కరే లంబాడీ సామాజిక వర్గానికి మంత్రి పదవి వచ్చింది..కాబట్టి ఒకటి ఆదివాసీలకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. ఒక్క శాతం కూడా లేని వెలమ కమ్యునిటీకి నాలుగు మంత్రి పదవులు ఎందుకని అన్నారు. బీసీల జనాభా దామాషా ప్రకారం 9 మంది మంత్రులు ఉండాలని.. ప్రస్తుతం మాత్రం నలుగురే ఉన్నారని చెప్పారు. మైనార్టీ లకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలి కానీ ఒక్కటే ఇచ్చారని చెప్పారు.
రాష్ట్రానికి గవర్నర్ గా మహిళ వచ్చింది కాబట్టి ఇద్దరు మహిళలకు కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని… లేకపోతె.. మహిళా మంత్రులు రాష్ట్ర క్యాబినెట్ లో ఉండేవారు కాదని అన్నారు మంద కృష్ణ. గవర్నర్ మీద ఉన్న భయంతో మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించారని చెప్పారు. ఆర్టీసీ సమ్మె కు మేము మద్దతిస్తున్నామని ఆయన చెప్పారు. ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలని… ఆర్టీసి కార్మికులతో పెట్టుకుంటే మీ కాలం దగ్గర పడ్డట్టేనని.. sc, st అట్రాసిటీ యాక్ట్ ను కొనసాగించాలని అన్నారు మంద కృష్ణ.