ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే రూ.10 లక్షలు ఇయ్యాలె

ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే రూ.10 లక్షలు ఇయ్యాలె

హైదరాబాద్: దళితులను మళ్లీ మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నడని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. దళిత బంధును మోసపూరిత పథకంగా మార్చొద్దన్నారు. అలా చేస్తే కేసీఆర్ మోసాల చిట్టా పెరిగినట్టవుతుందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేసిన మోసాలే ఆయనకు భవిష్యత్‌‌లో ఇబ్బందుల్లో పడేస్తాయని హెచ్చరించారు. నాయీ బ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారని.. ఇప్పటివరకు అది అమలు కాలేదన్నారు. ఆరేండ్ల నుంచి ఎన్నో హామీలు ఇస్తున్నారని.. కానీ నెరవేర్చడం లేదన్నారు. 

‘దళితులను మళ్లీ మోసం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తుండు. దీన్ని ఎవరూ నమ్మొద్దు. హుజూరాబాద్‌‌లో దళిత బంధును ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే సంపూర్ణంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నం. హుజురాబాద్ మాదిరిగానే అన్ని నియోజకవర్గాలకు ఇవ్వాలి. భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి కింద 30 లక్షలు ఇవ్వాలి. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే మంత్రి వర్గంలో మార్పులు చేసి.. వెలమ, రెడ్ల సంఖ్య తగ్గించి దళితులకు ప్రాధాన్యం ఇవ్వాలి. కళాకారుల సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు రసమయికి, అత్యంత మెజారిటీ సాధించిన అరూరి రమేష్‌‌కు మంత్రి వర్గంలో చోటు ఇవ్వాలి. సీఎం సలహా మండలిలో దళితుల ప్రాతినిధ్యం పెంచాలి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఈ డిమాండ్లను అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయకపోతే మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం’ అని మందకృష్ణ స్పష్టం చేశారు.