- మందమర్రి రైల్వే గేట్ వద్ద తప్పని తిప్పలు
- దశాబ్దాలుగా తీరని సమస్య
- రైళ్ల రాకపోకలతో గేట్ వద్ద ప్రజల నిరీక్షణ
- పనుల్లో స్పీడ్ పెంచాలని స్థానికుల డిమాండ్
కోల్‌బెల్ట్, వెలుగు : మందమర్రి రైల్వే గేటు వద్ద చేపట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైల్వే గేటు మీదుగా రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తయితే దశాబ్దాల సమస్య తీరుతుందని స్థానికులు రెండున్నర ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. రైల్వే శాఖ, కాంట్రాక్టర్నిర్లక్ష్యంతో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్దాలుగా తప్పని తిప్పలు..
మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియా ఊరురామకృష్ణాపూర్, పాకిస్తాన్క్యాంపు ప్రజలు, వాహనదారులు, మందమర్రి రైల్వే గేటు (ఊరురామకృష్ణాపూర్–-నార్లపూర్ గ్రామాల మధ్య) దాటుకుంటూ నార్లాపూర్, మేడారం, మంచిర్యాల, -బెల్లంపల్లి నేషనల్ హైవే ఫోర్‌లేన్ రహదారి, అందుగులపేట, మందమర్రి పాత బస్టాండ్, పులిమడుగు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. సికింద్రాబాద్–-న్యూఢిల్లీ బ్రాడ్ గేజ్ రైల్వే మార్గంలో రాకపోకలు సాగించే రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో గేట్ పడినప్పుడల్లా గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ప్రతిరోజు కనీసం 130 నుంచి 150 వరకు రైళ్ల రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒక్కసారి గేట్ వేస్తుంటారు. ఈ రైల్వే గేటు వద్ద అండర్‌బ్రిడ్జి నిర్మించాలంటూ ప్రజలు రైల్వే ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నారు.
దీంతో మార్చి 2023లో రూ.6 కోట్లతో అండర్‌బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులను ఆలం కన్స్ర్టక్షన్కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టగా, ఏప్రిల్2024లో పూర్తి చేయాలని ఆఫీసర్లు గడువు విధించారు. సుమారు 300 మీటర్ల పొడవున అండర్ బ్రిడ్జి, రెండు వైపుల దారులు, వరదనీరు నిలిచిపోకుండా సమీపంలోని రాళ్లవాగు(పాలవాగు)లో కలిపే విధంగా 2 కిలోమీటర్ల మేర వరద కాలువ నిర్మించాల్సి ఉంది.
నత్తనడకన నిర్మాణ పనులు..
మందమర్రి రైల్వే గేటు వద్ద చేపట్టిన రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణ పనులు మొదటి నుంచి నెమ్మదిగా సాగుతున్నాయి. మొదట పనులు చేపట్టిన కాంట్రాక్టర్వివిధ కారణాలు చూపుతూ జాప్యం చేశాడు. కేవలం రైల్వే ట్రాక్ కింద అండర్ బ్రిడ్జి బాక్స్‌ను ఏర్పాటు చేసి మందమర్రి సైడ్ కొంతదూరం రోడ్డు నిర్మించి వదిలేశాడు.
దీంతో రైల్వేశాఖ మిత్ర అనే కంపెనీకి ఏడు నెలల కిందట పనులు అప్పగించారు. భారీ వర్షాలతో సుమారు నాలుగైదు నెలల తర్వాత రెండో కాంట్రాక్ట్ కంపెనీ అండర్ బ్రిడ్జి పనులు చేపట్టింది. వచ్చే మార్చి నాటికి అండర్‌బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పుతున్న సాధ్యమయ్యేలా కన్పించడం లేదు.
తప్పని దూరభారం..
రెండున్నర ఏండ్లుగా రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ప్రజలు, స్థానికులకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పాలచెట్టు, మార్కెట్ ఏరియా, ఊరురామకృష్ణాపూర్, పాకిస్తాన్ క్యాంపు, రామన్‌కాలనీ, పాత బస్టాండ్, బురదగూడెం, అందుగులపేట ప్రజలు, వాహనదారులు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయణించి నేషనల్ హైవే, కోల్బెల్ట్రహదారికి చేరుకుంటున్నారు. త్వరగా బిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తే దూరభారం తగ్గుతుందని భావిస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే ఆఫీసర్లు స్పందించి అండర్‌బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
