కరోనా నిబంధనలు బేఖాతర్.. పెళ్లి నిలిపివేత

కరోనా నిబంధనలు బేఖాతర్.. పెళ్లి నిలిపివేత

మంగళూరు: కరోనా కేసులతో కిందా మిందా అవుతున్న కర్నాటక రాష్ట్రంలో కరోనా నిబంధనల ఉల్లంఘన విషయంలో అదికారులు చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఎంతగా అంటే ఒక శుభకార్యాన్ని అడ్డుకునేందుకు కూడా వెనుకాడడం లేదు. కర్ప్యూ ఆంక్షలు సడలింపులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పదేపదే హెచ్చరిస్తున్న పాలకులు, అధికారులు అన్నంత పనిచేసి చూపించడం హాట్ టాపిక్ అయింది. 
ఇతర శుభ కార్యాల మాటేమో గాని.. పెళ్లి వంటి శుభ కార్యాలు ముహూర్తాల సమయం ఆధారంగా నిర్ణీత వేళలలకే జరిగిపోతాయి. సరిగ్గా ముహూర్తం వేళకు భాజా భజంత్రీల మేళ తాళాల నడుమ వధువు మెడలో మూడు ముళ్లు వేయడం ఆనవాయితీ. ఇతర మతస్తుల పెళ్లిళ్ల సంగతేమో గాని హిందువుల పెళ్లిళ్లు మాత్రం నిర్ణయించిన టైంకు కచ్చితంగా తాళి కట్టడం జరిగిపోతుంది. కరోనా సమయంలో ఏ వేడుక అయినా సరే మినహాయింపులు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులు ఆదివారం బంధువులు, సన్నిహితుల సమక్షంలో గుడి ఆవరణలోని ఫంక్షన్ హాలులో జరుుగుతున్న పెళ్లిని అడ్డుకున్నారు. 

పెళ్లి నిర్వాహకులు, హాజరైన వారిపై క్రిమినల్ కేసు నమోదు
మంగళూరు నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీ మంగళాదేవి ఆలయంలో ఆదివారం పెళ్లిళ్లు జరుగుతున్నట్లు సమాచారం అందింది. కరోనా సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా పెళ్లిళ్లు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే ఆలయానికి చేరుకున్నారు. అక్కడి ఫంక్షన్ హాలులో పరిమితకి మించిన జనాలతో పెళ్లి జరగడం చూసి అడ్డుకున్నారు. జిల్లా పోలీసు అధికారి డాక్టర్ కె.వి. రాజేంద్ర కన్నడ మీడియాతో మాట్లాడుతూ ఇంటి దగ్గర పెళ్లికి అనుమతిస్తే వీరి గుడికి వచ్చి ఇక్కడి ఫంక్షన్ హాలులో పెళ్లి చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ ఆలయంలోకి భక్తులకు, ఇతర జనాలకు ప్రవేశానికి అనుమతే లేదని ఆయన స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు  పెళ్లి నిర్వాహకులతోపాటు ఆలయం అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు.