- ఎన్‌డీటీవీ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేతలపై మణిశంకర్ అయ్యర్ విమర్శలు
- శశి థరూర్‌కు విదేశాంగ మంత్రి పదవి కావాలి.. జైరామ్ తన పదవి కాపాడుకోవాలి
- పవన్ ఖేరా పార్టీ ప్రతినిధి కాదని కామెంట్లు
- కేరళలో కాంగ్రెస్ ఓటమి ఖాయం.. నాయకుల్లో ఐక్యతలేదని వెల్లడి
తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మళ్లీ పార్టీని ఇబ్బంది పెట్టే కామెంట్లు చేశారు. ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీలోని సహచర నాయకులపై విమర్శలు చేశారు. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ గెలవదు అన్నారు. కారణం, కాంగ్రెస్ నేతలు కమ్యూనిస్టుల కంటే ఒకరినొకరు ఎక్కువగా ద్వేషిస్తారు అని అన్నారు.
అదే సమయంలో కేరళ సీఎం పినరయ విజయన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు అని జోస్యం చెప్పారు. దీనిపై కాంగ్రెస్సీనియర్ నేత పవన్‌ఖేరా స్పందిస్తూ మణిశంకర్ అయ్యర్‌కు కాంగ్రెస్ సంబంధం లేదని, అయ్యర్ కామెంట్లు ఆయన వ్యక్తిగతమైనవని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అలాగే కేరళలో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని తెలిపారు.
థరూర్పాక్ వ్యతిరేకి
ఆదివారం తిరువనంతపురంలో ‘‘విజన్ 2031: డెవలప్‌మెంట్ అండ్ డెమోక్రసీ” అనే సెమినార్ లో పాల్గొన్న అయ్యర్ ఎన్డీ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. మాట్లాడుతూ శశిథరూర్, పవన్‌ఖేరా, జైరామ్రమేశ్పై విమర్శలు చేశారు. పవన్ ఖేరాను ‘పప్పెట్’ అంటూ వివాదాస్పందగా కామెంట్ చేశారు. ఖేరా పార్టీ ఫేస్కాదన్నారు. గత రెండేళ్లుగా ఖేరా తనపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ఖేరా స్థానంలో మరొకరని చూసుకోకపోతే ఆ పార్టీ ఇలాగే కొనసాగుతుందని అన్నారు. కేరళలో కాంగ్రెస్ గెలవాలని తాను కోరుకుంటానని అయ్యర్ చెప్పారు. అయితే నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. వారు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారని.. దీంతో ఇక్కడ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. శశి థరూర్‌పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. థరూర్ పాకిస్తాన్ వ్యతిరేకి అని అన్నారు. ఆయన తదుపరి విదేశాంగ మంత్రి పదవి కావాలి అని కోరుకుంటున్నారని చెప్పారు.
‘కాంగ్రెస్ కమ్యూనికేషన్ హెడ్ జైరామ్ రమేశ్ తన ఉద్యోగం కాపాడుకోవాలి’ అని అయ్యర్ అన్నారు. ఈ సెమినార్‌కు హాజరు కావొద్దని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అనేక మంది మేధావులకు లేఖలు రాసిందని అయ్యర్ విమర్శించారు. ‘‘ఇది పొగడ్తనో లేక అవమానమో నాకు తెలియదు, కానీ ఈ సందర్భంగా నా పార్టీ సహచరులు లేకపోవడం పట్ల నేను తీవ్రంగా చింతిస్తున్నాను, ఇది రాష్ట్ర కార్యక్రమం, దేశ కార్యక్రమం’’ అని అన్నారు. పంచాయతీ రాజ్‌లో కేరళ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.
