సర్వేల ఆధారంగా అభ్యర్థులకు కాంగ్రెస్ టికెట్లు : ఠాక్రే

సర్వేల ఆధారంగా అభ్యర్థులకు కాంగ్రెస్ టికెట్లు  : ఠాక్రే

సర్వేల ఆధారంగా టికెట్లు
కేటాయింపు నిర్ణయం అధిష్టానానిదే 
బీఆర్ఎస్ పై నమ్మకం పోయింది
కేసీఆర్ అవినీతిని జనంలోకి తీసుకెళ్లాలి
టీమ్ వర్క్ చేస్తేనే గెలుపు సాధ్యం
తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ సర్కారే
ఏఐసీసీ ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అధిష్టానం చేసిన సర్వేల ఆధారంగా ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే చెప్పారు. తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసిందని, నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పనిచేయాలని సూచించారు. ఇవాళ గాంధీభవన్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఇన్ చార్జీలతో పీసీసీ చీప్​ రేవంత్ తో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల నమ్మకం పోయిందని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

జిల్లా, మండల, గ్రామ,బూత్ కమిటీల ఏర్పాటులో గొడవలు జరగకుండా చూసుకోవాలన్నారు. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని క్యాడర్ కు చెప్పాలని, వాళ్లను ప్రజలకు వివరించాలని సూచించాలని అన్నారు. కర్నాటక ఎన్నికల్లో టీమ్ వర్క్ తోనే గెలుపు సాధ్యమైందని అన్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసిన వారిని తప్పక గుర్తిస్తామని చెప్పారు. ఇందుకు కర్నాటకలో మంత్రి పదవి పొందిన బోసురాజే ఉదాహరణ అని అన్నారు. 

ఆరు నెలలు కష్టపడితే..

రాబోయే ఆరు నెలలు చాలా కీలకమని, కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు తథ్యమని మానిక్​ రావు ఠాక్రే నాయకులకు సూచించారు. పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు తమకు కేటాయించిన సెగ్మెంట్లలో పర్యటించడం లేదని ఠాక్రే అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలా అయితే గెలుపు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 

పేపర్, చానల్ ద్వారా అబద్ధాల ప్రచారం

కేసీఆర్ రెండు రోజులకో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారని ఠాక్రే అన్నారు. తనకు పేపర్, చానల్స్ ఉన్నాయని, వాటి ద్వారా తాను అభివృద్ధి చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలని మీరు అవగాహన కల్పించాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. వాటిని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని అన్నారు. మనం అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని గట్టిగా చెప్పాలని తెలిపారు. 

భట్టి యాత్ర వెయ్యి కిలోమీటర్ల సంబురాలు

సీఎల్పీ నేతల మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ గాంధీ భవన్ లో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. మార్చి 16న ప్రారంభమైన పాదయాత్ర ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో సాగుతోంది. మొత్తం 1,365 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. 

తీర్మానాలు 

1. ఏఐసీసీ సెక్రటరీలుగా నియమితులైన బోసురాజు, నదీం జావిద్ లకు అభినందనలు
2. బోయిన్ పల్లిలోని రాజీవ్ గాంధీ నాలెడ్జి సెంటర్ శంకుస్థాపనకు సోనియాను ఆహ్వానించడం
3. వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అభినందనలు
4. పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీ తమకు కేటాయించిన సెగ్మెంట్ల నివేదికలను ప్రతి 15 రోజులకు ఒక సారి పంపాలి.