
మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన భయంకరమైన వీడియోను చూసిన తరువాత తాను రాత్రంతా నిద్రపోలేదని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చీఫ్ స్వాతి మలివాల్ అన్నారు. ఈ ఘటన జరిగి రెండున్నర నెలలైనా ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.. రాష్ట్రంలోని ఇతర మహిళలపై కూడా ఇలాంటి కేసులు ఇంకా ఉండవచ్చు అని ఆందోళన వ్యక్తం చేశారు. . మణిపూర్‌లో హింసను ముగించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మణిపూర్ సీఎం, ప్రధాని మోదీకి తాను లేఖ రాస్తానని స్వాతి తెలిపారు.
మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లేదంటే మేమే రంగంలోకి దిగుతాం. చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేసింది.
ఈ వీడియో చాలా ఆందోళన కలిగించేలా ఉందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. మీడియా, సోషల్ మీడియాల్లో వైరల్ అయిన వీడియో ఆధారంగా మణిపూర్ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి గురువారం విచారణ చేపట్టింది.