మ‌ణిపూర్ అరాచ‌కం : నిందితుడి ఇంటిని త‌గ‌ల‌బెట్టిన మహిళలు

మ‌ణిపూర్ అరాచ‌కం :   నిందితుడి ఇంటిని త‌గ‌ల‌బెట్టిన మహిళలు

మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ మెయితేయి ఇంటిని గ్రామంలోని  కొంతమంది మహిళలు నిప్పు తగలబెట్టారు. పేచీ అవాంగ్ లీకైలో ఉన్న నిందితుడి ఇంటిని చుట్టుముట్టి టైర్లతో కాల్చేశారు.  అతని కుటుంబాన్ని వెలేస్తున్నట్లుగా  నినాదాలు చేశారు.  ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు.   మణిపూర్‌లోని తౌబల్ జిల్లాలో 2023 మే 4న కుకీ-జోమి కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అరెస్టయిన నలుగురిలో పేచీ అవాంగ్ లీకై గ్రామానికి చెందిన 32 ఏళ్ల హీరోదాస్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.. మిగిలిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.  

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను ఓ గుంపు నగ్నంగా ఊరేగిస్తూ.. అసభ్యకరంగా తాకుతూ.. కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిపై సామూహిక అత్యాచారానికీ పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారంటూ ఫేక్ వీడియో విడుదల కావడం వల్లే.. ఆ వర్గం వాళ్లు ప్రత్యర్థి వర్గానికి చెందిన మహిళలపై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తున్నది.

ఇంఫాల్‌కు 35 కిలో మీటర్ల దూరంలోని కాంగ్‌పోప్కి జిల్లాలో మే 4న ఈ ఘటన జరిగింది. ఇప్పుడు మహిళల నగ్న ఊరేగింపునకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. మణిపూర్‌లో మే 3 నుంచి ఇంటర్నెట్‌ వినియోగంపై నిషేధం ఉంది. అందుకే ఇన్ని రోజులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రాలేదని తెలుస్తున్నది. రెండు నెలలుగా మెజార్టీ వర్గమైన మైతీలు, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.