అసమానతలతోనే మణిపూర్​లో ఆగ్రహజ్వాలలు

అసమానతలతోనే మణిపూర్​లో ఆగ్రహజ్వాలలు

ప్రజల్లో ఆగ్రహావేశాలు గూడుకట్టుకున్నప్పుడు అవి లావాలా పెల్లుబుకడానికి చిన్న నిప్పు రవ్వ చాలు. మణిపూర్​లో ఇటీవల జరిగింది అదే. ల్యాంకా అనే చోట ఒక టిప్పర్ ట్రక్​అదుపు తప్పి బైక్ ను ఢీకొంది. అంతటితో ఆగకుండా అక్కడ పక్కనే ఉన్న  మంచినీటి బాటిళ్ల పైనుంచి దూసుకువెళ్లింది. ఆ బాటిళ్లు గిరిజన నిరసనకారులవి. మేటీ తెగవారిని షెడ్యూల్డు తెగ(ఎస్టీ) కింద చేర్చకూడదని వారు శాంతియుతంగా నిరసన చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కాకతాళీయంగా, ఆ ట్రక్కు డ్రైవర్ కూడా మేటీ తెగకు చెందినవాడే. గిరిజనులు అతడిని చావగొట్టారు. దీనికి ప్రతిగా మేటీ మూకలు అదే రోజు లైతాంగ్ లోని ఆంగ్లో-కుకీ వార్ మెమోరియల్ గేటును ధ్వంసం చేశాయి. వారు కాంగ్ వై గ్రామంలోని వేజియాయ్ తెగవారి గృహాలను నేలమట్టం చేశారు. ఈ ఘటనలు మరింత కల్లోలంగా మారి మణిపూర్ ను బుగ్గిపాలు చేస్తున్నాయి. హింసాయుత ఘర్షణల్లో ఇంతవరకు అనధికారిక లెక్కల ప్రకారం 52 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. మణిపూర్​లో వివిధ తెగల మధ్య  విద్వేషాలకు ఏదో ఒక్క కారణాన్ని వెతికిపట్టుకోవడం కష్టం. ఒకదానితో ఒకటి ముడిపడిన చాలా రకాల అంశాలు వివిధ వర్గాల మధ్య కలహాలకు  కారణమవుతున్నాయి. 

మారుతున్న జనాభా వర్గాలు

మణిపూర్​లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వంలో మేటీల ప్రాతినిధ్యమే ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా గిరిజనులు వాటిని సందేహించడం ఎక్కువగా ఉంది. రాష్ట్ర జనాభాలో మేటీలు సుమారు 53 శాతం మంది ఉంటారు. గిరిజనులు 40 శాతం మంది ఉంటారు. వారిలో నాగాలు, కుకీలు ఎక్కువ. కుకీ-జోమ గిరిజనుల్లో క్రైస్తవులు ఎక్కువ. మేటీల్లో హిందువులు ఎక్కువ. మేటీలు, పాన్ గాల్స్ (ముస్లింలు)కు  మధ్య 1993లో ఇలాగే పెద్దఎత్తున ఘర్షణలు జరిగాయి. వీరే కాకుండా మణిపూర్ లో ఇంకా అనేక జాతులు, తెగలవారున్నారు. ఒక్క నాగాలలోనే 15 రకాల వారున్నారని చెబుతారు. హింసాయుత ఘర్షణలు మణిపూర్ కు కొత్తేమీకాదు కానీ కుకీ-జోమీ గిరిజనులు, మేటీలు ఇలా ప్రత్యక్ష ఘర్షణలకు దిగడం గత మూడు దశాబ్దాలలో ఇదే మొదటిసారి. 

అడవులను ఖాళీ చేయాలనే ఆదేశం

లోయలు, ఎత్తు మరీ ఎక్కువగా ఉండని కొండలతో కూడిన భౌగోళిక స్వరూపం మణిపూర్ ది. కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు జిల్లాలను అలా ఉంచితే, తూర్పు ఇంఫాల్, పశ్చిమ ఇంఫాల్, బిష్ణుపూర్, తౌబాల్ లోయ జిల్లాల కిందకు వస్తాయి. భూభాగంలో లోయ జిల్లాలది దాదాపు పది శాతమే అయినా, రాష్ట్ర మొత్తం జనాభాలో ఇంచుమించుగా 60 శాతం లోయ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. మణిపూర్ లో దక్షిణాదిన కుకీ-జోమీ-హెర్మా తెగలవారు ఎక్కువగా ఉన్న విశాలమైన భూభాగాలను ప్రత్యేకించిన అడవి(ఆర్ఎఫ్), సంరక్షిత అడవి(పీఎఫ్), వన్య ప్రాణి అభయారణ్యం(డబ్ల్యుఎస్), చిత్తడి నేలలుగా ప్రభుత్వం ప్రకటించింది. దాంతో కొండల్లోని పలు గ్రామాల నుంచి గిరిజనులు బలవంతంగా ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ ప్రక్రియలో భాగంగా రెండు మూడు చర్చిలు కూడా నేలమట్టమైనట్లు అంచనా. వారు అక్కడ చాలా కాలం నుంచి ఉంటున్నవారు కాదని, భూములను అక్రమంగా ఆక్రమించుకున్నవారని ప్రభుత్వ వాదన. భూ పట్టాలను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం తిరస్కరించింది. దానికి వ్యతిరేకంగా కొందరు చేసుకున్న అప్పీలును మణిపూర్ హైకోర్టు ఆ మధ్య తిరస్కరించింది. 

లోపించిన సమన్వయం

మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, అస్సాం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్నాటకలలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల భూ హక్కుల సంరక్షణకు రాజ్యాంగంలో 371వ అధికరణంలోని సెక్షన్లు వీలు కల్పిస్తున్నాయి. జిల్లా కౌన్సిళ్లు, పర్వత ప్రాంతాల కమిటీ(హెచ్ఏసీ)లు వాటిననుసరించి ఏర్పడినవే. కేంద్రం, సదరు రాష్ట్రాల గవర్నర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పౌర సమాజ సంఘాలు సమన్వయంతో పనిచేయాలి. కానీ, అలాంటి సమన్వయం లోపించబట్టే  మణిపూర్ భూమి శిస్తు, భూ సంస్కరణల చట్టాన్ని కొండ ప్రాంతాలకు వర్తింపజేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కుకీలను ఖాళీ చేయించిన తర్వాత వందలాది మంది నిరాశ్రయులకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. అరవై మంది సభ్యుల మణిపూర్ శాసన సభలో కుకీ తెగకు చెందినవారు పది మంది ఉన్నారు. వారిలో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కాగా, ఇద్దరు బీజేపీకి మిత్రపక్షమైన కుకీ పీపుల్స్ అలయన్స్ (కేపీఏ)కి చెందినవారు. మిజోరంలోని మిజో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం మయన్మార్ నుంచి వస్తున్నవారిపట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఇది కూడా దాని పొరుగుననున్న రాష్ట్రాలకు ఇబ్బంది కలిగిస్తోంది. హింసాకాండకు తెరదించి, వివిధ తెగల మధ్య చర్చల ద్వారా శాంతి స్థాపనకు కేంద్రం ప్రయత్నించినప్పుడే నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్ఈడీఏ) సార్థకమవుతుంది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించడం కన్నా ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యేలతోనే సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం ఆ రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా శ్రేయస్కరం.

అక్రమ వలసలు

బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ లోకి అక్రమ వలసల మాదిరిగానే మయన్మార్ నుంచి ఈశాన్య ప్రాంతంలోకి చొరబడి స్థిరపడిపోతున్నవారు ఉన్నారు. ముఖ్యంగా మయన్మార్ లో 2021 ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటు శరణార్థుల సమస్యను సృష్టించింది. చురాచాంద్​పూర్ జిల్లాలో కొత్త గ్రామాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని మేటీలు ఆరోపిస్తున్నారు. మయన్మార్ నుంచి వచ్చినవారు నల్లమందు తయారీకి ఉపయోగపడే గసగసాలు పండిస్తున్నారని సీఎం ఎన్. బీరేన్ సింగ్ వెల్లడిస్తున్నారు. మణిపూర్​వాసులు అనిపించుకునేందుకు మణిపూర్ లో ఎన్నాళ్ల నుంచి ఉండాలి? ఏనాటి నుంచో ఇక్కడ ఉంటున్నవాళ్లం “విదేశీయులం”, “బయటివారం” ఎలా అవుతామని అక్కడి వారి ప్రశ్న. మణిపూర్ నైరుతి దిగ్భాగంలో ఉన్న చురాచాంద్ పూర్ లో మైదాన ప్రాంతాలు, కొండలు రెండూ ఉన్నాయి. దేశంలో కటిక పేదరికానికి పేరుపడ్డ జిల్లాల్లో అదీ ఒకటని  పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అనుమతి లేకుండా బయటవారు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేసేందుకు ఇన్నర్ లైన్ పర్మిట్(ఐఎల్పీ) విధానాన్నితేవాలని గతంలో డిమాండ్ తలెత్తినపుడు చురాచాంద్ పూర్ లో దానికి వ్యతిరేకంగా అంతే ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎవరు మణిపూర్ నివాసులో ఎవరు కాదో ప్రభుత్వం నిర్ణయిస్తుందని, ప్రభుత్వం సాధికారికంగా గుర్తించిన వారికే రాష్ట్రంలో భూములు కొనే హక్కు ఉంటుందని అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఓక్ రామ్ ఐబోబి సింగ్ కూడా ప్రకటించి రెండు బిల్లులు తెచ్చారు. కానీ, కుకీ-జోమీ తెగలవారు హింసకు దిగడంతో వాటిని తర్వాత ఉపసంహరించుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలే దిక్కు

మొదట రిజర్వేషన్ల అంశాన్ని తీసుకుంటే.. మణిపూర్ లో ఉపాధికి ప్రభుత్వమే పెద్ద దిక్కుగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పించి ఇతర జీవనమార్గాలు తక్కువ. కొందరికే ఎస్టీలుగా ఉద్యోగాలు దక్కడం వల్ల మిగిలిన వారికి అన్యాయం జరుగుతోందని మేటీల వాదన. మణిపూర్ లో మొత్తం16 జిల్లాలున్నా ప్రధానంగా రాష్ట్రాన్ని లోయ, కొండ ప్రాంతాలుగా విభజించి చూస్తారు. లోయ ప్రాంతాల్లో భూములు కొనేందుకు గిరిజనులకు అవకాశం ఉంది. కానీ, మేటీలు కొండ ప్రాంతాల్లో భూములు కొనడం నిషేధం. ఇది సరిగా లేదని మేటీల అభిప్రాయం. ఈశాన్య ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం మునుపటికన్నా ఎక్కువగా కృషి చేస్తోంది. ముఖ్యంగా రైలు మార్గాలు వేస్తున్నది. సహజంగానే ఉద్యోగావకాశాలు కూడా పెరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో తమనూ ఎస్టీలుగా ప్రకటించాలని మేటీలు కోరుతున్నారు. మేటీలను ఎస్టీ కేటగిరీలో చేర్చితే తమ వాటా తగ్గిపోతుందని గిరిజనులు భావిస్తున్నారు.