ఎంపీ మనోజ్ తివారీని అరెస్టు చేసి విచారించాలని డిమాండ్

ఎంపీ మనోజ్ తివారీని అరెస్టు చేసి విచారించాలని డిమాండ్

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కన్వీనర్​ అరవింద్ కేజ్రీవాల్ ను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. ఇందులో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయం ఉందన్నారు. కేజ్రీవాల్ ను చంపేస్తామని తివారీ బహిరంగంగానే బెదిరించారని తెలిపారు. ఆయనను వెంటనే అరెస్టు చేయాలని, కుట్ర కోణంపై విచారించాలని డిమాండ్ చేశారు. మనోజ్ తివారీ చేసిన ట్వీట్ నేపథ్యంలో సిసోడియా ఈ ఆరోపణలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో సిసోడియా మాట్లాడారు. తివారీ మాటలను బట్టి కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని అర్థమవుతోందన్నారు. ‘‘ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోంది. ఇలాంటి బెదిరింపులకు భయపడబోం” అని అన్నారు. కాగా, మనోజ్ తివారీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆప్ లీడర్లు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్​ను చంపుతామంటూ బెదిరించారని, చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఆప్​లో ఫ్రస్ట్రేషన్: బీజేపీ 

సిసోడియా ఆరోపణలను తివారీ కొట్టిపారేశారు. కేజ్రీవాల్​ను చంపేందుకు కుట్ర జరుగుతోందని సిసోడియా ప్రతిఏటా చెబుతుంటారని విమర్శించారు. ‘‘సిసోడియా అరెస్టు కాబోతున్నారని కేజ్రీవాల్.. కేజ్రీవాల్​ను చంపబోతున్నారని సిసోడియా చెబుతున్నారు. అసలేం జరుగుతుందో నాకర్థం కావట్లేదు” అని అన్నారు. ఆప్ లీడర్ సందీప్ భరద్వాజ్​ది ఆత్మహత్య కాదు.. హత్య అని, దీనికి కేజ్రీవాలే బాధ్యుడని ఆరోపించారు. ఆప్ లీడర్లు ఫ్రస్ట్రేషన్​లో మాట్లాడుతున్నారని బీజేపీ మండిపడింది. ప్రజల్లో సానుభూతి కోసం ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది.

అసలేం జరిగింది? 

కేజ్రీవాల్ పై దాడి జరగొచ్చంటూ మనోజ్ తివారీ గురువారం ట్వీట్ చేశారు. ‘‘కేజ్రీవాల్ భద్రతపై ఆందోళనగా ఉంది. ఎందుకంటే అవినీతి, టికెట్లు అమ్ముకోవడం, రేపిస్టులతో ఫ్రెండ్ షిప్, జైళ్లలో మసాజ్ లాంటి ఘటనలతో ప్రజలు, ఆప్ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే వాళ్లు ఎమ్మెల్యేలపై దాడి చేశారు. అలాంటిది కేజ్రీవాల్ కు జరగొద్దు” అని అందులో పేర్కొన్నారు. దీం​తో ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. 

లిక్కర్ స్కామ్ కేసు ఫేక్: కేజ్రీవాల్ 

లిక్కర్ స్కామ్ కేసు ఫేక్ అని కేజ్రీవాల్ అన్నారు. ఫేక్ కేసు పెట్టి, అందులో సిసోడియాను ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. ‘‘సీబీఐ చార్జ్ షీట్ లో సిసోడియా పేరు లేదు. ఆ కేసు మొత్తం ఫేక్. దాడుల్లో ఏమీ దొరకలేదు. 800 మంది అధికారులు 4 నెలలు దర్యాప్తు చేసినా ఏమీ కనిపెట్టలేదు. ఎడ్యుకేషన్ లో సంస్కరణలు తీసుకొచ్చి, పేద పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకాన్ని సిసోడియా ఇచ్చారు. అలాంటి మంచి వ్యక్తిని ఫేక్ కేసులో ఇరికించి, ఆయన పరువు తీయాలని కుట్ర పన్నారు” అని ట్వీట్ చేశారు. కాగా, ఎఫ్ఐఆర్ లో సిసోడియా పేరును పేర్కొన్న సీబీఐ.. తాజాగా చార్జ్ షీట్​లో మాత్రం ఆయన పేరును చేర్చలేదు.