నాకు బీజేపీ నుంచి ఓ మెసేజ్ వచ్చింది

నాకు బీజేపీ నుంచి ఓ మెసేజ్ వచ్చింది

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బీజేపీ నుంచి ఓ మెసేజ్ వచ్చిందని స్వయానా ఆయనే వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. (బ్రేక్ ది ఆప్ అండ్ జాయిన్ బీజేపీ) ఆప్ నుంచి వైదొలగి, బీజేపీలో చేరండి.. మీపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులన్నింటినీ మాఫీ చేయిస్తామని మెసేజ్ వచ్చినట్టు సిసోడియా తెలిపారు. దానికి సమాధానంగా ఆయన రిప్లై కూడా ఇచ్చానన్నారు. తాను రాజపుత్రుడినని, మహారాణా ప్రతాప్ వంశస్థుడినని .. తలనైనా నరుక్కుంటాను గానీ,.. అవినీతిపరుల ముందు తలవంచను అని చెప్పినట్టు సిసోడియా పేర్కొన్నారు. తనపై పెట్టిన కేసులన్నీ అబద్దమన్న ఆయన.. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అంటూ సిసోడియా సవాల్ విసిరారు.

ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు కేసులో ఇటీవలే సీబీఐ మనీష్ సిసోడియాకు లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దేశం నుంచి ఎక్కడికీ వెళ్లకూడదన్న నిబంధనతో జారీ చేసిన ఈ నోటీసులను ఓ జిమ్మిక్కుగా పేర్కొన్నారు. తాను ఢిల్లీలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నానని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానన్నారు. కాగా పలుఇళ్లలో సోదాలు నిర్వహించిన అనంతరం.. టెండర్ల తర్వాత లైసెన్స్ పొందినవారికి అనుకూలంగా, వారికి వివిధ ప్రయోజనాలను కల్పించేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకున్నారని సీబీఐ ఆరోపణలు చేసింది. ప్రత్యేక కోర్టులో ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేసింది. ఆ ఎఫ్‌ఐఆర్‌లో మనీష్ సిసోడియాను ఏ1 నిందితుడిగా చేర్చింది. లిక్కర్ వ్యాపారుల్లో ఒకరైన సమీర్ మహేంద్రు ఇండోస్పిరిట్ కంపెనీ యజమాని అని, మనీశ్ సిసోడియాకు సన్నిహితులకు రెండుసార్లు కోట్లాది రూపాయలను సమీర్ చెల్లించినట్లు పేర్కొంది. ఈ కేసులో కొంతమందికి సమన్లు కూడా జారీ చేసింది.