ఆయన హయాంలో దేశ ఆర్థిక ప్రగతి నిలిచిపోయింది

ఆయన హయాంలో దేశ ఆర్థిక ప్రగతి నిలిచిపోయింది

ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి యూపీఏ హయాంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అసాధారణమైన వ్యక్తే.. కానీ ఎందుకో తెలియదు గానీ.. కొన్ని కారణాల వల్ల కావచ్చు.. అప్పట్లో దేశ ఆర్థిక ప్రగతి నిలిచిపోయిందన్నారు. అహ్మదాబాద్ ఐఐఎం విద్యార్థులను, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న కొన్ని విషయాలను గురించి మాట్లాడుతూ.. మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయని నారాయణ మూర్తి అన్నారు. ఆనాడు ఆయన తమ హయాంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని ఆరోపించారు. ఆ రోజుల్లో అంతర్జాతీయ సమావేశాలలో చైనా పేరు ఎక్కువ సార్లు వినిపించేదని, భారతదేశం పేరు చాలా అరుదుగా వినిపించేదని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రపంచ వాణిజ్యంలో భారత్ ఆశలు చిగురించాయన్నారు. భారతదేశ యువత దేశాన్ని చైనాకు తగిన పోటీదారుగా మార్చగలదని ఈ సందర్భంగా మూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.