రూ. 100 మన్ కీ బాత్ కాయిన్..మోడీ లెగసీకి గుర్తింపు

రూ. 100 మన్ కీ బాత్ కాయిన్..మోడీ లెగసీకి గుర్తింపు

ప్రధాని మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకోబోతుంది. ఈ నెల 30వ తేదీన మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్కు చేరుకోనుంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ దేశానికి ఓ బహుమతి ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ 30 జరిగే మన్‌ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోడీ రూ.100 కాయిన్ను విడుదల చేయనున్నారు. 

రూ. 100 కాయిన్లో ప్రత్యేకతలు..

ఏప్రిల్ 30న ప్రధాని మోడీ విడుదల చేయనున్న కాయిన్‌పై మైక్రోఫోన్‌ సింబల్ ఉంటుంది. దీనిపై 2023 అని ప్రింట్ చేసి ఉంటుంది. మన్ కీ బాత్ సందర్భంగా కేవలం ఒకే ఒక్క రూ. 100 కాయిన్ మాత్రమే ప్రింట్ చేయనున్నారు. ఈ కాయిన్‌ను వెండి, రాగి, నికెల్, జింక్‌తో తయారు చేశారు. కాయిన్ ముందు అశోక స్తంభం  ఉండనుంది. దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఓ వైపు ఇండియా అని రాయడంతో పాటు.. రూపీ సింబల్‌ కూడా ఉంటుంది. మైక్రోఫోన్‌ సింబల్‌తో పాటు సౌండ్ వేవ్స్‌ సింబల్‌ కూడా ఆర్బీఐ ప్రింట్ చేయనుంది.  హిందీ, ఇంగ్లీష్ భాషల్లో Mann Ki Baat 100 అని ప్రింట్ చేయనున్నారు. ఈ కాయిన్ బరువు 35 గ్రాములు ఉండనుంది.

 

గతంలోనూ...

రూ. 100 కాయిన్ను విడుదల చేయడం ఇదే మొదటి సారి కాదు.  గతంలోనూ అనేక సందర్భాల్లోనూ రూ. 100 కాయిన్ ను ఆర్బీఐ ప్రింట్ చేసింది. అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మారకార్థం గతంలో ప్రధాని మోడీ 100 రూపాయల కాయిన్‌ విడుదల చేశారు. రాజ్‌మాత విజయ్‌రాజ్ సిందియా శత జయంతి సందర్భంగా కూడా రూ.100 కాయిన్‌ను రిలీజ్ చేశారు. మహారాణ ప్రతాప్ 476వ జయంతి సందర్భంలోనూ రూ. 100  కాయిన్ ప్రింట్ అయింది. 2010, 2011,2012, 2014, 2015లో రూ. 100 కాయిన్స్ ను కేంద్రం ప్రింట్ చేయించింది.