మన్నెగూడ–హైదరాబాద్ రోడ్డు పనులు స్పీడప్

మన్నెగూడ–హైదరాబాద్ రోడ్డు పనులు స్పీడప్
  •     రూ.1,138 కోట్లతో 46 కి.మీ. ఫోర్ లేన్ వర్క్ స్టార్ట్ 
  •     2026 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కల్లా పూర్తి చేస్తామన్న ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఐ
  •     ఎన్జీటీ కేసు ముగియడంతో  రోడ్డు పనులకు గ్రీన్ సిగ్నల్
  •     ఈ మార్గంలోనే ఇటీవల బస్సుపై కంకర టిప్పర్​పడి 21 మంది మృతి

హైదరాబాద్​, వెలుగు: చాలా ఏండ్లుగా ఆగిపోయిన మన్నెగూడ–హైదరాబాద్ నేషనల్ హైవే నాలుగు వరసల రోడ్డు నిర్మాణ పనులు ఎట్టకేలకు స్పీడందుకున్నాయి.ఇటీవల ఈ రోడ్డుపైనే ఆర్టీసీ బస్సుపై కంకర టిప్పర్ పడి 21 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. 

దీంతో రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్, వికారాబాద్, చేవేళ్ల మధ్య ఎన్ హెచ్ 163పై రూ.1,138 కోట్లతో 46.40 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి.పర్యావరణ అనుమతులకు సంబంధించి కోర్టు కేసులు ముగియడంతో వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పనులు పూర్తి చేస్తామని ఎన్​హెచ్ఏఐ  అధికారులు చెబుతున్నారు.

2018లో వర్క్​ ప్రపోజల్​.. 2022లో శంకుస్థాపన

హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకు ఉన్న 163 నేషనల్ హైవేను నాలుగు వరసలుగా మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. విడతల వారీగా పనులు స్టార్ట్ అయ్యాయి. ఓఆర్ఆర్ అప్పా జంక్షన్ నుంచి మన్నేగూడ వరకు 46.405 కి.మీ దూరం ఫోర్ లేన్స్ రోడ్డు వేయాలని మొదట రూ.785 కోట్లు కేటాయించారు. 

హ్యామ్ పద్ధతిలో నిర్మాణం చేయాలని భావించగా, మొయినాబాద్-మన్నేగూడ మధ్య 2,500 చెట్లు తొలగించకూడదని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో కేసు నమోదు కావడంతో భూసేకరణ పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత 2022లో మరోసారి రూ.900 కోట్లు కేటాయించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ ఎన్జీటీ కేసు తేలకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయి.

ఎన్జీటీలో కేసు కొలిక్కి

గత నెల 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది మరణించడంతో దేశవ్యాప్తంగా సంచలనమైంది. రోడ్డు గుంతలతో ఇరుకుగా ఉండటం, టిప్పర్ ఓవర్ స్పీడ్ కారణంగా ఆర్టీసీ బస్సుపై పడటంతో మహిళలు, చిన్నపిల్లలు చనిపోయారు.ఈ నేపథ్యంలో మన్నేగూడ–హైదరాబాద్ ఫోర్ లైన్స్ రోడ్డు నిర్మాణంపై చర్చ జరిగింది. ఎన్జీటీలో కేసు తేలడంతో క్లియరెన్స్ వచ్చింది. 

రాష్ట్రం తరఫున ఎన్ హెచ్ ఏఐ అధికారులతో సమీక్షలు నిర్వహించి పనులు వేగవంతం చేశారు. కాంట్రాక్ట్ సంస్థలతో మాట్లాడి ఎన్జీటీ ఆదేశాల ప్రకారం 85% చెట్లను కాపాడుతూ 150 చెట్లను రీ అలోకేట్ చేశారు. అప్పా జంక్షన్ నుంచి మన్నేగూడ వరకు రోడ్డు వైడనింగ్, మొయినాబాద్-చేవెళ్ల ఏరియాలో ల్యాండ్ లెవలింగ్ పనులు జరుగుతున్నాయి.

2026 డిసెంబర్​ నాటికి పనులు కంప్లీట్​ చేస్తాం!

మన్నెగూడ–హైదరాబాద్​ మధ్యన చేపట్టిన 46 కి.మీ ఎన్​హెచ్​ నాలుగు వరసల రోడ్డు నిర్మాణ పనులను వచ్చే ఏడాది డిసెంబర్​ 31 వరకు కంప్లీట్​ చేస్తాం. ఇప్పటికే కాంట్రాక్ట్​ సంస్థకు దీనికి తగినట్లుగా మార్గదర్శకాలు జారీ చేశాం. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటూనే పనులు వేగవంతం చేసినం. గడువులోగా పనులు పూర్తి చేస్తాం.  శివ శంకర్​, రీజినల్​ మేనేజర్​, ఎన్​హెచ్​ఏఐ, హైదరాబాద్​