
ఫ్యాక్టరీలో చనిపోతే.. కోనేట్లో వేశారు
న్యాయం చేయాలని నిరసన
తూప్రాన్, మనోహరాబాద్, వెలుగు : తన భర్త ఫ్యాక్టరీలో కరెంట్ షాక్ తో చనిపోతే యజమానులు అతన్ని కోనేరులో వదిలి మూడు రోజుల వరకు గోప్యంగా ఉంచారని ఆరోపిస్తూ మృతుని భార్య, కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ ముందు బైఠాయించారు. దీంతో ఫ్యాక్టరీ యజమానులు బోర్డును తొలగించి పరారయ్యారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ పారిశ్రామిక వాడలోని యు కిస్ సీడ్ ఫ్యాక్టరీలో సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి మల్లేశ్(29) ప్లాంట్ ఆపరేటర్ గా పనులు చేస్తున్నాడు. బుధవారం మల్లేశ్డ్యూటీకి వెళ్లాడు. రాత్రి 8 గంటలకు భార్య నవ్య ఫోన్ చేస్తే 10 గంటల వరకు డ్యూటీ ఉందని చెప్పాడు. అతడు ఇంటికి రాకపోవడంతో రాత్రి 10:30 కు ఫోన్ చేయగా లిఫ్ట్చేయలేదు. అక్కడే వాటర్ ప్లాంట్ మేనేజర్ గా పని చేసే యాదగిరిని అడుగితే మల్లేశ్ డ్యూటీకి రాలేదని చెప్పాడని, మరో అరగంటకు యాదగిరి ఫోన్ చేసి మల్లేశ్ ను మీ ఊరి వేణుగోపాలస్వామి గుడి కోనేరు దగ్గర వదిలి వెళ్లినట్టు చెప్పారన్నారు. తన భర్త కోసం అన్ని చోట్ల వెతికికామని, ఆచూకీ దొరకకపోవడంతో మనోరాబాదు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు ఫ్యాక్టరీలో సీసీ ఫుటేజ్ పరిశీలించి వెళ్లిపోయారని, శుక్రవారం మధ్యాహ్నం తన భర్త శవం కోనేరులో కనిపించిందని చెప్పారు. బుధవారం రాత్యే తన భర్త విద్యుత్ ప్రమాదానికి గురై మరణించగా గుట్టు చప్పుడు కాకుండా యాదగిరి, సెక్యూరిటీ సిబబ్ంది కలిసి కోనేరులో తన భర్త శవాన్ని వదిలిపెట్టి వెళ్లారని ఆరోపించింది. తన పిల్లలు మోక్షిత్(5), మనస్విని ( ఐదు నెలలు), అత్త మామలు, ఇతర కుటుంబసభ్యులతో కలసి ఫ్యాకట్రీ దగ్గరకు రాగా బోర్డును తొలగించి..ఫ్యాక్టరీని మూసేశారని వాపోయింది. ఫ్యాక్టరీ యజమానుల మీద చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది.