బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ మంత్రి

బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ మంత్రి

పంజాబ్ మాజీమంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మన్‌ప్రీత్ సింగ్ ఆ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వర్గపోరు ఉందని ఆరోపించారు. 

మన్‌ప్రీత్ సింగ్ బాదల్ రాజీనామాపై  కాంగ్రెస్ పీసీసీ చీఫ్  అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందించారు. అధికార దాహంతోనే ఆయన పార్టీ మారారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిసే అప్పట్లో బాదల్  కాంగ్రెస్ లో చేరారని అమరీందర్ అన్నారు.  ఆయన లాంటివారు ఐదేళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉండలేరని విమర్శించారు.   

పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కు బంధువైన మన్‌ప్రీత్ బాదల్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అకాలీదళ్ పార్టీ నుండి బహిష్కరించిన తరువాత పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్‌ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అనంతరం దానిని కాంగ్రెస్ లో విలీనం  చేశారు.