నెలకు కోటి డోసుల కెపాసిటీతో కొవాగ్జిన్‌ కొత్త ప్లాంట్ షురూ

నెలకు కోటి డోసుల కెపాసిటీతో కొవాగ్జిన్‌ కొత్త ప్లాంట్ షురూ

గుజరాత్ లోని అంక్లేశ్వర్ లో భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలైంది. ఫస్ట్ బ్యాచ్ టీకాలను కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణా ఎల్లా, జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా పాల్గొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం సమగ్ర ప్రణాళిక ఉందన్నారు మాండవీయ. రెండు రోజుల క్రితమే ఒకేరోజు కోటికి పైగా డోసులు వేసిన విషయం గుర్తు చేశారు. దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకా ఉత్పత్తికి మరో కొత్త ప్రొడక్షన్ యూనిట్ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెంచడం ఈ దిశగా మరో అడుగు పడినట్లయిందంటూ మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్ చేశారు. అంక్లేశ్వర్‌‌లో అందుబాటులోకి వచ్చిన కొత్త ప్లాంట్ నుంచి ప్రతి నెలా కోటి వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని ఆయన చెప్పారు.

ఏడాదికి 100 కోట్ల డోసులు

కొవాగ్జిన్ టీకా డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తిని పెంచుతున్నామని భారత్ బయోటెక్‌ సంస్థ చైర్మన్‌ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. గ్లోబల్ సేఫ్టీ స్టాండర్డ్స్‌తో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. ఏడాదికి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలన్న టార్గెట్‌కు కొత్త ప్లాంట్ ప్రారంభం సహకరిస్తుందని ఆయన చెప్పారు.