ఈటల కోసమేనా పుట్టా మధు అరెస్ట్?

ఈటల కోసమేనా పుట్టా మధు అరెస్ట్?
  • వారం రోజులుగా అజ్ఞాతంలో మధు
  • తమ అదుపులోనే ఉన్నాడని టాస్క్‌ఫోర్స్ పోలీసుల ప్రెస్‌నోట్
  • వామన్‌రావు కేసులో విచారణకోసమంటున్న పోలీసులు
  • ఈటల విషయంలో సమాచారం కోసమేనని ఊహాగానాలు

పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధును రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత వారం రోజుల నుంచి ఆయన అదృశ్యం కావడానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు. కాగా.. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు పుట్ట మధు ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. అయితే ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం.. ఆ తర్వాత ఆయన ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్ మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ప్రెస్‌మీట్ పెట్టినప్పటినుంచి పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లాడు. కాగా.. ఈటల వ్యవహారం బయటకు రావడంతోనే మధుకు చెక్ పెట్టారని స్థానికులంతా భావిస్తున్నారు. ఈటల మీద వేటుపడిన తర్వాత.. క్రమక్రమంగా ఆయన అనుచరుల మీద కూడా ప్రభుత్వం కన్నేసినట్లు అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పుట్టా మధును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈటల గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకే మధును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే గత వారం రోజుల నుంచి మధు.. చత్తీస్‌ఘర్‌లో ఉంటున్న తన కూతురి దగ్గర ఉన్నారని వార్తలొచ్చాయి. అదే తరుణంలో ఆయన భార్య అయిన మున్సిపల్ చైర్మన్ శైలజ.. పుట్ట మధు ఆచూకీ తెలుసుకోవాలని కోరుతూ కొంతమంది మంత్రులను కలిసి వచ్చారని తెలుస్తోంది. దాంతో పుట్టా మధు అజ్ఞాతం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత శుక్రవారం మధు భార్య శైలజ ప్రెస్‌మీట్ పెట్టి.. మధుకు కరోనా లక్షణాలున్నాయని, అందుకే ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. ఆ మరుసటి రోజే మధు తమ అదుపులో ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రెస్‌నోట్ విడుదల చేశారు.  కానీ విశ్వసనీయ సమాచారం మేరకు మధు రెండు లేదా మూడు రోజులనుంచి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా.. వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై బలంగా ఆరోపణలు వినిపించాయి. ఆయన్ను ఈ కేసులో ఇప్పటికే రామగుండం కమిషనరేట్ పోలీసులు ఓసారి విచారించారు. వామనరావు తండ్రి కిషన్ రావు ఇటీవల మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లయింట్ పైనా పుట్ట మధును టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. వామన్‌రావ్ దంపతుల హత్య జరిగి మూడు నెలలు గడిచింది. ఆ సమయంలో ఈ హత్యతో పెద్ద లీడర్లు ఎవరికీ సంబంధం లేదని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాంటప్పుడు మరి వామన్‌రావు కేసులో మళ్లీ ఇప్పుడు పుట్ట మధును విచారించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా.. ఈటల రాజేందర్ వ్యవహారంతోనే పుట్ట మధుపై మళ్లీ పాతకేసులు తిరగతోడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్, పుట్ట మధు చాలా సన్నిహితులుగా ఉంటారని తెలుస్తోంది. ఈటల వ్యాపారాలు, ఆస్తులు అన్నీ కూడా మధుకు చాలా క్లియర్‌గా తెలుసు. అందుకే పుట్ట మధును అదుపులోకి తీసుకున్నారని కూడా అనుకుంటున్నారు. ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేయడం కోసమే పుట్ట మధును ఆయుధంగా వాడుకుంటున్నారని అనుకుంటున్నారు. కాగా.. ఈటల వ్యవహారాలు చెప్పడంలో పుట్ట మధు సహకరించకపోతే ఏం చేయాలి అనేదానిపై కూడా పోలీసులు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల విషయంలో మధు నిజాలు చెప్పకపోతే.. మధును కూడా టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం పుట్టా మధు అనుచరులను అదుపులోకి తీసుకొని.. మధు వ్యాపారాలు, ఇసుక దందా, ఎక్కడెక్కడ భూములు కొన్నారు అనే విషయాలు కూపీ లాగుతున్నారని సమాచారం. మొత్తంగా ఈటలను టార్గెట్ చేసేందుకే ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చినట్లు అంతా చర్చించుకుంటున్నారు.