న్యూఢిల్లీ: భారత తయారీ రంగం వృద్ధి ఈ ఏడాది మార్చిలో నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఫిబ్రవరిలో 56.9గా ఉండగా, మార్చిలో 53.9కి తగ్గింది. పీఎంఐ 50కి పైగా ఉంటే విస్తరిస్తున్నట్టు. పశ్చిమాసియాలో యుద్ధం, ఖర్చులు పెరగడం, తీవ్రమైన పోటీ, మార్కెట్ అనిశ్చితి వంటి కారణాలతో తయారీ కంపెనీలకు కొత్త ఆర్డర్లు తగ్గాయి.
దీంతో ప్రొడక్షన్ గ్రోత్ నెమ్మదించింది. అల్యూమినియం, కెమికల్స్, ఇంధనం వంటి ఇన్‌పుట్ ఖర్చులు గత మూడేన్నరేళ్లలో అత్యధికంగా పెరిగాయి. అయినప్పటికీ, కంపెనీలు వినియోగదారులను నిలుపుకోవడానికి, కొత్త క్లయింట్లను పొందడానికి ప్రొడక్ట్‌ల ధరలను కంట్రోల్‌లో ఉంచాయి. ఔట్‌పుట్ ధరలను పెద్దగా పెంచలేదు. ఎగుమతుల్లో బలమైన వృద్ధి నమోదైంది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యూరప్, జపాన్, మిడిల్ ఈస్ట్, తుర్కియే, వియత్నాం వంటి దేశాల నుంచి ఆర్డర్లు పెరిగాయి. ఉద్యోగ నియామకాలు ఏడు నెలల గరిష్టానికి చేరాయి. అలాగే భవిష్యత్‌లో ఉత్పత్తి పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి.
