మానుకోటలో పీపుల్స్ పోలీస్...

మానుకోటలో పీపుల్స్ పోలీస్...
  •     పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవర్లకు కంటి వైద్య శిబిరాలు
  •     బాధితుల గృహాల వద్దనే ఎఫ్ఐఆర్ ల నమోదు
  •     గంజాయి బాధితుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు

మహబూబాబాద్, వెలుగు: పోలీసులంటే కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాదు.. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి  పరిష్కారానికి కృషి చేస్తామంటున్నారు మానుకోట పోలీసులు. ఆయా గ్రామాల సర్పంచ్​లు, గ్రామపెద్దల సహకారంతో మహబూబాబాద్​ ఎస్పీ శబరీశ్​ చొరవతో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజలకు మరింతగా చేరువవుతున్నారు.  

గ్రామాల్లో పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించడం, రోడ్డు ప్రమాదాల నివారణ, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, చిన్న పిల్లలతో వెట్టిచాకిరిపై అవగాహన కల్పించడం, నేరాల నియంత్రణకు గృహలు, వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. జిల్లాస్థాయిలో ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతున్నారు.

రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక నజర్..​

మహబూబాబాద్​ జిల్లాలో రోడ్డు ప్రమాదాల శాతం పెరుగుతుండటంతో మైనర్లకు వాహనాలను ఇవ్వద్దని కోరడంతో పాటుగా డ్రంక్ అండ్ డ్రైవ్​ కేసులు నమోదు చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాలు నడిపే ఆటో డ్రైవర్లు, ఇతర డ్రైవర్ల కోసం ప్రత్యేక కంటి పరీక్షలను నిర్వహించడంతో పాటుగా కంటి అద్దాలను ఉచితంగా అందిస్తున్నారు. ప్రమాదాల నివారణకు రోడ్ల పై భారీ గుంతలను పూడ్చడం, హెచ్చరిక బోర్డులు లేని చోట ఆర్అండ్​బీ, ఇతర శాఖల సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు.

ఇంటివద్దే ఎఫ్ఐఆర్​ల నమోదు..

గతంలో పోలీసులు వివిధ సమస్యలపై ప్రజలు నేరుగా పీఎస్​లో ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ కేసుల నమోదు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించేవారు. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలకడమే కాకుండా ఎవరైనా బాధితులు పోలీస్ స్టేషన్ వరకు రాలేకపోవడం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సమస్యలను తెలుసుకుని నేరుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లే బాధితుల వద్దకు వెళ్లి వారి ఇంటి వద్ద వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని అందిస్తున్నారు. పబ్లిక్ పోలీసింగ్ పై  జిల్లా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం బయ్యారం, కురవి మండలంలో ఇప్పటికే అమలు జరుగుతుంది.

గంజాయి బాధితుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు.. 

జిల్లాలో కొంతమంది యువత తెలిసీతెలియని వయసులో గంజాయి మత్తులో తూగుతున్నారు. మత్తుకు బానిసలైన యువత ఆరోగ్యం కాపాడడం కోసం పోలీసులు జిల్లా ప్రభుత్వ వైద్యుల సహకారంతో ప్రత్యేకమైన వైద్య శిబిరాలను  ఏర్పాటు చేయడం, యువతను మత్తు పదార్థాల నుంచి దూరం చేయడానికి తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అవసరమైన వారికి నిరంతర చికిత్స, కౌన్సిలింగ్​ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు

సమాజంలో నేరాలు జరగడం కంటే ముందస్తుగా, ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం మహబూబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. కమ్యూనిటీ పోలీసింగ్​లో భాగంగా ఇటీవల జిల్లా ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో పాటుగా వారి భాగస్వామ్యంతో గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. వివిధ వర్గాల ప్రజలంతా పోలీసులకు సహకరించాలి.- డాక్టర్ శబరీశ్, మహబూబాబాద్ జిల్లా ఎస్పీ