మానుకోట కు న్యూ లుక్ శరవేగంగా పట్టణ ఆధునీకరణ పనులు

మానుకోట కు న్యూ లుక్ శరవేగంగా పట్టణ ఆధునీకరణ  పనులు

మహబూబాబాద్, వెలుగు: ఒకప్పుడు మేజర్​ గ్రామపంచాయతీగా ఉన్న మానుకోట జిల్లా ఏర్పాటు తర్వాత ఆధునిక పట్టణంగా శరవేగంతో విస్తరించడంతో అభివృద్ధి పనులు, పట్టణీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో మహబూబాబాద్​ పట్టణంలో రోడ్ల విస్తరణ, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల అభివృద్ధితో పట్టణం న్యూ లుక్​ను సంతరించుకుంటుంది. మహబూబాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.1.05 కోట్లతో ఐదు ప్రధాన కూడళ్లలో జంక్షన్ల అభివృద్ధి జరుగుతుంది.

మూడు కో ట్ల సెంటర్ జంక్షన్​కు రూ.25 లక్షలు, కురవి గేట్​జంక్షన్​కు రూ.25 లక్షలు, ఆర్టీసీ సెంటర్ కు రూ.15 లక్షలు, వ్యవసాయ మార్కెట్ సెంటర్ రూ.15 లక్షలు, ముత్యాలమ్మ గుడి సెంటర్ కు రూ.25 లక్షలతో చేపట్టిన జంక్షన్ల నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. ఈ జంక్షన్ల సుందరీకరణలో భాగంగా పెయింటింగ్స్​, వాటర్ ఫౌంటెన్లను ఏర్పాటు చేస్తున్నారు. 

పట్టణం చుట్టూరా పాత బజారులోని మథర్ థెరిస్సా సెంటర్, ఆర్టీసీ బస్టాండ్​ నుంచి నర్సంపేట బైపాస్, అక్కడి నుంచి వ్యవసాయ మార్కెట్ వరకు రోడ్ల విస్తరణ జరగడంతోపాటు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో రాత్రి వేళల్లో వెలుతురుతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. కొత్త బజార్​లోని జిల్లా ఆస్పత్రి నుంచి ఫాతిమా హైస్కూల్ వరకు, మూడుకోట్ల సెంటర్ నుంచి పాత కలెక్టరేట్ వరకు, రోడ్ల విస్తరణతో పాటు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేశారు.

రూ.50 కోట్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం..

మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన  కేసముద్రం మున్సిపాలిటీకి రూ.100 కోట్లు, మానుకోట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మున్సిపల్​అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. మరో పక్క పట్టణంలో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ చేశారు. వీటికితోడు జిల్లా కేంద్రంలో వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు వరంగల్ నగరం తరహాలో పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)ను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు.